*ఫరీద్‌పేట్‌లో సర్పంచ్‌పై అధికారుల విచారణ…

*ఫరీద్‌పేట్‌లో సర్పంచ్‌పై అధికారుల విచారణ…

విచారణలో నకిలీ బిల్లు లతో పనులు ఎక్కడ చేశారని ప్రత్యక్షంగా పరిశీలన..

గ్రామంలో ఇరువర్గాల ఆరోపణలు..

* మాజీ సర్పంచ్ భాగ్యమ్మ హయాంలోనే పనులు జరిగాయని అధికారులకు వినతిపత్రం..

ఫరీద్ పెట్ గ్రామంలో పోలీస్ పహార మధ్య విచారణ..

* సర్పంచ్, వార్డు సభ్యుల మధ్య వాగ్వాదం*..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 29 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా పాల్వoచ మండలం ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, నకిలీ బిల్లులు, చేయని పనులకు చెల్లింపులు, ప్రైవేట్ ఆస్తులకు ప్రజా ధనం మళ్లింపు ఆరోపణలపై శుక్రవారం నిర్వహించిన జాయింట్ ఎంక్వైరీ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసు బందోబస్తు నడుమ విచారణ చేపట్టారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ ఉత్తర్వులతో జిల్లా ఆడిట్ అధికారి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా పంచాయతీ అధికారి, పాల్వంచ మరియు మాచారెడ్డి మండలాల ఎంపీడీఓ లు గ్రామంలో పర్యటించి రికార్డులు పరిశీలించడంతో పాటు సంబంధిత పనుల స్థలాలను సందర్శించారు.

ఈ సందర్భంగా దాదాపు మంది గ్రామస్థులు సంతకాలు వంద చేసిన వినతిపత్రాన్ని విచారణాధికారులకు సమర్పించారు. మాజీ సర్పంచ్ ఆశం భాగ్యమ్మ హయాంలో గ్రామపంచాయతీ నిధులతో ఇప్పటికే పూర్తయిన డ్రైనేజీలు, సీసీ రోడ్లు , ఇతర అభివృద్ధి పనులను మళ్లీ కొత్త పనులుగా చూపించి నర్సింహ రెడ్డి బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపించారు. గ్రామ ప్రజల తరఫున సమర్పించిన ఫిర్యాదులో రూ.9,61,937 విలువైన పనులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

విచారణ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను అధికారులకు వివరించారు. కొన్ని సందర్భాల్లో సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి, ఫిర్యాదుదారుడు మధుసుధాన్ రెడ్డి నీ తన ముందుకి తీసుకొని వచ్చిన తర్వాతే విచారణ చేయాలని చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకుని విచారణను కొనసాగించారు.

మరోవైపు వార్డు సభ్యులు కూడా ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించి, గ్రామ పంచాయతీ నిధుల వినియోగం, తీర్మానాలు, రికార్డుల నిర్వహణ, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

విచారణ సందర్భంగా గ్రామస్థులు “నీ సొంత అల్లుడే నువ్వు చేసిన అవినీతిని బయటకు తీసుకొస్తున్నాడు” అంటూ చేసిన వ్యాఖ్య అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విచారణ అనంతరం అధికారులు మాట్లాడుతూ, ఫిర్యాదుదారులు, గ్రామస్థులు, వార్డు సభ్యులు మరియు సంబంధిత వ్యక్తుల వాదనలు విన్నామని, సంబంధిత రికార్డులను పరిశీలించామని, పనుల స్థలాలను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి, తదుపరి చర్యల కోసం పంపనున్నట్లు వెల్లడించారు.

గ్రామస్థులు, వార్డు సభ్యులు మాట్లాడుతూ, విచారణలో ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు మరియు బాధ్యులైన అధికారులపై క్రిమినల్, పరిపాలనా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!