అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి

– అక్రిడిటేషన్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలి

– టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా శాఖ

 

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్);

జిల్లాలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన జారీ చేయడంతో పాటు, ఇటీవల జరిగిన అక్రిడిటేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కామారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. వినతిపత్రంలో జిల్లాలో పనిచేస్తున్న పలువురు అర్హులైన జర్నలిస్టులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ కాలేదని పేర్కొన్నారు. మరోవైపు అర్హతలపై సందేహాలు ఉన్న కొందరికి కార్డులు మంజూరైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. దీంతో నిజాయితీగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పారదర్శకంగా పునఃసమీక్షించి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని కోరారు. ప్రజాసేవలో నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా ఇండ్ల స్థలాలు కేటాయించాలని, ఉచిత బస్ పాసులు అందించాలని, ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డులు మంజూరు చేసి రాష్ట్రంలోని అత్యధిక ఆసుపత్రుల్లో వాటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి, తమ వినతులపై జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో మోహన్, తిరుపతి రెడ్డి, సాయిలు, నరసింహులు, అనిల్, బద్రి, నరేష్, రాజు, లింగం, మహమ్మద్ నయీమ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!