పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ సంక్షోభం …
ఇరాన్, అమెరికా మధ్య తీవ్రస్థాయిలో దాడులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్);
ఇరాన్‌పై అమెరికా తన దాడులను ఉధృతం చేయడంతో పశ్చిమాసియా ప్రాంతం మళ్లీ యుద్ధరంగంగా మారుతోంది. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కువైట్, బహ్రెయిన్‌లపై ఇరాన్ విస్తృతంగా దాడులకు తెగబడింది. తాజాగా ఆదివారం ఉదయం కువైట్, బహ్రెయిన్‌లతో పాటు ఖతార్, యూఏఈ దేశాలపై కూడా ఇరాన్ భారీ దాడులు జరిపినట్లు ఆయా దేశాలు అధికారికంగా ప్రకటించాయి. ఒమన్‌పై కూడా దాడులు జరిగినట్లు అనధికారిక నివేదికలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని తాము బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. దీంతో గల్ఫ్ దేశాల్లో మరోసారి తీవ్ర అశాంతి, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు ఇరాన్‌పై మూడో విడత వైమానిక దాడులను విజయవంతంగా పూర్తి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున జరిపిన ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన 140 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని, గత మూడు రోజుల్లో ఇరాన్‌లోని 300కు పైగా కేంద్రాలపై దాడులు నిర్వహించామని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులు స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే ఈ సైనిక చర్య చేపట్టినట్లు వారు వెల్లడించారు. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు సమాధానంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సైనిక అధికారులు వివరించారు.
యుద్ధవిమానాలు, డ్రోన్లు, యుద్ధనౌకలను ఉపయోగించి అమెరికా ఈ దాడులను నిర్వహించింది. ఇరాన్ యొక్క క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ కేంద్రాలు, ఆయుధ సంపత్తి కేంద్రాలు, సమాచార వ్యవస్థలు, తీరప్రాంత నిఘా కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే సాధారణ సరుకు రవాణా నౌకలపై, పౌర నావికులపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ప్రాంతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.


