జులై 14 న రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్….ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు…
*జూనియర్ కళాశాలల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల కళాశాలల బంద్ కు పిలుపు..
*లక్షల మంది విద్యార్థులకు విద్యాప్రదాయిని అయిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వ కుట్ర..
*విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 6 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టి, బీసీ, ఈ బీసీ విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలని,వారి కుటుంబాలను ఆర్థికంగా, సామాజిక ఉన్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని,ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జూలై 14వ తేదీన రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి లో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీ అనంతరం రాంబాబు మాట్లాడుతూ”రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా 11000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి యేట 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని,4.5 మంది సర్టిఫికెట్స్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తుంగలో తొక్కుతూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నదని,మా ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడంతో పాటుగా,గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని చెప్పిన నేటి ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కిందనీ అన్నారు.
ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని,బడ్జెట్ కాలేజిలు సైతం మూతపడుతున్నాయని, పొట్టకూటి కోసం లెక్చరర్ గా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు.ఈ రోజు కామారెడ్డి లో నిర్వహించిన ఈ భారీ నిరసన ర్యాలీతో అయినా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, లేకపోతే ఇదే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అంకురార్పణ అవుతుందని, అన్ని కళాశాల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలై కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం రాస్తాయన్నారు.పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ రాక్షసానందం పొందుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసన ABVP ఆధ్వర్యంలో జూలై 14 తేదీన నిర్వహించబోయే రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ ను విద్యార్థులు, తల్లిదండ్రులు,మేధావులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


