ఎన్యుమరేషన్ ఫారాల పంపిణి ప్రక్రియ పూర్తి చేయాలి …
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్యుమరేషన్ ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేసి, డిజిటైజేషన్‌ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌ఓలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌ఓలు)తో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 25 నుంచి ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ తుది దశకు చేరుకుందని తెలిపారు. పంపిణీ చేసిన ఫారాలను ఓటర్లు పూర్తి చేసిన అనంతరం వాటిని తిరిగి సేకరించి, సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) బి ఎల్ ఓ యాప్‌లో డిజిటైజేషన్ చేయాలని సూచించారు. అవసరమైతే వాలంటీర్ల సహకారంతో ఓటర్లకు ఫారాల పూరణలో సహాయం అందించాలని తెలిపారు.
డిజిటైజేషన్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జూలై 20 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టి, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు సమాచారం సమర్పించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు 99 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తైందని, మిగిలిన ప్రక్రియను రేపటిలోగా పూర్తి చేస్తామని తెలిపారు.
జిల్లాలో డిజిటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌ను పకడ్బందీగా చేపడతామని, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లతో కార్యాచరణ ప్రకారం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు .
జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వి. గిరి, ఎల్లారెడ్డి ఆర్డీవో, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


