రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయాలి …
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్..
రైతులకు ఆదర్శంగా నా 12.5 ఎకరాల వరి సాగును నిలిపివేసి ఆయిల్ ఫామ్ సాగు ప్రారంభించాను..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 6 (అఖండ భూమి న్యూస్);
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లాలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వరి సాగు చేస్తున్న 12.5 ఎకరాల భూమిలో వరి పంటను నిలిపివేసి ఆయిల్ ఫామ్ సాగును సోమవారం ప్రారంభించారు. రైతులకు కేవలం సూచనలు ఇవ్వడం మాత్రమే కాకుండా, తానే ఆచరించి చూపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ,
రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వినియోగం తగ్గింపు, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలకు భవిష్యత్తులో మంచి మార్కెట్‌తో పాటు స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
ప్రస్తుతం వరి సాగులో సాగునీటి వినియోగం అధికంగా ఉండటంతో పాటు ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతోందని, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు నీటిని ఆదా చేసే పంటల సాగుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దీర్ఘకాలికంగా అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఆన్నారు.
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు శాస్త్రీయ సలహాలు అందిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సాంకేతిక సహకారం అందిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ సూచనలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించాలని ఆకాంక్షించారు.
రైతుల్లో విశ్వాసం పెంపొందించడమే తన లక్ష్యమని, అందుకే ముందుగా తన వ్యవసాయ క్షేత్రంలోనే పంట మార్పు చేపట్టానని షబ్బీర్ అలీ తెలిపారు. రైతులు కూడా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు నాయకులు పాల్గొన్నారు.


