టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలని సంఘాల ప్రతిపాదన..

టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలని సంఘాల ప్రతిపాదన.. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్న కంబాల శ్రీనివాసరావు

 

 

గురుపూజోత్సవ కానుకగా 25 వేల మంది మహిళా ఉపాధ్యాయులకు పట్టు వస్త్రాలు

మహిళల ముంగిటకు కంబాల కానుక.. పల్లెల్లో పట్టుచీరల పండుగ .. ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతి మహిళకూ బహుమతి

రాజానగరం, జగ్గంపేట, పోలవరం నియోజకవర్గాల పరిధిలో విస్తృత పంపిణీ

* ఈ శనివారం సీతానగరం, శ్రీరంగపట్నం వేదికగా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం

రాజమహేంద్రవరం; అఖండ భూమి;

 

రాజమహేంద్రవరం , జూలై 08

రాజమహేంద్రవరం కేంద్రంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకుడు కంబాల శ్రీనివాసరావు మహిళా సాధికారత, సంక్షేమమే ధ్యేయంగా మరో బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. గడచిన మూడేళ్లుగా ఆషాఢ, శ్రావణ మాసాలను పురస్కరించుకుని పల్లెల్లోని మహిళలకు బంగారు ఆభరణాలు, కానుకలు అందిస్తున్న ఆయన, ఈ ఏడాది మరింత విస్తృతంగా పట్టుచీరల పంపిణీ చేపట్టనున్నారు. గతంలో లక్కీ డ్రా విధానం ద్వారా పదిహేను వేల నుంచి పాతిక వేల మందికి చీరలు అందజేయగా, ఈసారి ఆ పద్ధతికి స్వస్తి పలికారు. రాజానగరం, జగ్గంపేట, పోలవరం నియోజకవర్గాల పరిధిలో ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతి మహిళకూ ఎలాంటి మినహాయింపులు లేకుండా పట్టుచీరను బహుమతిగా అందించాలని నిర్ణయించారు. ఈ శనివారం సీతానగరం, శ్రీరంగపట్నం తదితర గ్రామాల్లో ఈ పంపిణీ మహాకార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. గ్రామంలో ఎంత మంది మహిళలు ఉంటే, అందరికీ ఈ కానుకలు అందజేయనున్నారు. గతంలో చీరలు అందుకున్న మహిళల ముఖాల్లో కనిపించిన ఆనందమే తనను ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేలా ప్రేరేపించిందని ఆయన తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కంబాల శ్రీనివాసరావు, రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు.

సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ, భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ వృత్తి పట్ల తనకున్న అమితమైన గౌరవాన్ని ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు చాటుకున్నారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయులను కూడా ఈ కానుకల పంపిణీలో భాగస్వాములను చేశారు. ఎంపిక చేసిన గ్రామాలతో పాటు, సుమారు పాతిక వేల మంది మహిళా టీచర్లకు ప్రత్యేకంగా పట్టుచీరలు అందజేయనున్నట్లు ప్రకటించారు. సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంగానూ చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయన, భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాల్లో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ బాధ్యతలను సైతం ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయన చేస్తున్న నిరంతర ప్రజాసేవను గుర్తించిన కాకినాడకు చెందిన పలు ఉపాధ్యాయ సంఘాలు, వచ్చే ఏడాది జరగనున్న ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ముందు ప్రతిపాదన ఉంచాయి. దీనిపై స్పందించిన కంబాల, తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని, ఎమ్మెల్సీ బరిలో దిగే విషయంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయ సంఘాలకు సూచించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యపరంగా అండగా నిలుస్తూ కంబాల శ్రీనివాసరావు తన సేవా యజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!