అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు

అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు

అమెరికా దేశ ప్రతినిధిగా జేమ్స్ వాట్ కొమ్ము నియామకం

 

రాజమహేంద్రవరం: అఖండ భూమి ; తెలుగు సాహిత్యం, కళల అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీ శ్రీ కళావేదిక సంస్థ అమెరికా దేశ ప్రతినిధిగా ప్రవాసాంధ్రుడు, రాజమండ్రి వాసి డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్మును నియమించింది. ఈ మేరకు శనివారం రాజమండ్రిలోని షెల్టాన్ హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ కో-ఆర్డినేటర్ కేతా శ్రీనివాసరావు చేతుల మీదుగా జేమ్స్ వాట్ కొమ్ముకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ, శ్రీ శ్రీ కళావేదిక ద్వారా ప్రతి ఏడాది రాష్ట్రంలోని నలుమూలల నుంచి కవులు, రచయితలు, కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రపంచ మహాసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సాహిత్యం, సంగీతం, నాటకం, జానపద కళలు వంటి విభిన్న రంగాల్లో విశేష సేవలందిస్తున్న కళాకారులను గుర్తించి ఘనంగా సత్కరించడం సంస్థ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

జాతీయ కో-ఆర్డినేటర్ కేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలుగు భాషా సంస్కృతులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు శ్రీ శ్రీ కళావేదిక కృషి చేస్తోందన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒకే వేదికపైకి తీసుకురావడంలో జేమ్స్ వాట్ కొమ్ము సేవలు ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

నూతనంగా అమెరికా దేశ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ, శ్రీ శ్రీ కళావేదిక తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. వచ్చే ప్రపంచ మహాసభలను అమెరికాలో నిర్వహించే దిశగా చర్యలు చేపడతామని, అక్కడి తెలుగు కవులు, కళాకారులను మరింతగా ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

అనంతరం సభలో పాల్గొన్న పలువురు సాహితీవేత్తలు, కళాకారులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సాహితీ ప్రేమికులు, కళాకారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!