రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు – భిక్కనూర్‌లో ఏర్పాటు చేస్తున్నాం: షబ్బీర్ అలీ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గం బిక్కనూర్ మండలం రామేశ్వరం పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్‌గా బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యులను నాయకులు అభినందించారు.
రైతుల ఆర్థిక అభివృద్ధికి పిఏపీఎస్ లు కీలకం: షబ్బీర్ అలీ..
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి వెన్నెముకగా ఉన్న రైతులకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యం. రైతులకు అవసరమైన పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సేవలు సకాలంలో అందేలా సహకార సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలి అని సూచించారు.
PACSలు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా కాకుండా రైతుల సమస్యలకు పరిష్కారం చూపే కేంద్రాలుగా మారాలని అన్నారు. గ్రామీణ ప్రాంత రైతులకు నేరుగా సేవలు అందించడంలో నూతన పాలకవర్గాలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించడం, గ్రామీణ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు.
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని షబ్బీర్ అలీ తెలిపారు.
నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు అయ్యాయని, దీనిని బిక్కనూర్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని, అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
నూతన పిఎసిఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి గారిని అభినందించిన షబ్బీర్ అలీ, రైతులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి రైతుకు సమాన సేవలు అందిస్తూ సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ గారు మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. కొంత ఆలస్యం కావచ్చు కానీ ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటుంది అని అన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను దాదాపు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తోంది” అని పేర్కొన్నారు.
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడంలో పి ఏ సి ఎస్ ఎన్ చైర్మన్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామస్థాయిలోనే సేవలు అందించేలా సహకార సంఘాలు పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఎడ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, భీంరెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఇరేని సందీప్ సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


