అక్కడ స్టే ఇవ్వకుంటే, ఇక్కడకు వస్తారా….

అక్కడ స్టే ఇవ్వకుంటే, ఇక్కడకు వస్తారా….

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు….

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;అక్టోబర్ 6.
(అఖండభూమి న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సోమవారం నాడు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వంగ గోపాల్ రెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ అంశం హైకోర్టు లో విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది బదులు ఇస్తూ, హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిందని న్యాయస్థానానికి తెలిపారు. అక్కడే స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే, ఇక్కడికి వస్తారా అని వ్యాఖ్యానిచ్చిన ధర్మాసనం, కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని చెబుతూ పిటిషన్ను తిరస్కరించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సి, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందని వంగ గోపాల్ రెడ్డి తన పిటిషన్ లో ఆరోపించారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం కోట 67 శాతానికి చేరిందని, ఇది చట్ట విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. జీవో నెంబర్ 9ని తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ లో మాధవరెడ్డి, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నలు కూడా ఇంప్లిడ్ అయ్యారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నెంబర్ 9ను జారీ చేసి, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అవకాశం కల్పించింది. ఈ జీవో ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9 నుండి 11 వరకు ఐదు దశలలో ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యులు, సర్పంచులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుల ఎన్నికల కోసం షెడ్యూల్ను ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి పెద్ద ఊరట కలిగించింది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు…..

Akhand Bhoomi News

error: Content is protected !!