ఇస్రో మరో భారీ ప్రయోగం.. నింగిలోకి ‘బాహుబలి’ రాకెట్!

శ్రీహరికోట నుంచి నేడు ఇస్రో కీలక ప్రయోగం
భారత గడ్డపై నుంచి అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగమిది..
‘బాహుబలి’ ఎల్వీఎమ్3-ఎమ్5 రాకెట్ ద్వారా ప్రయోగం..
సాయంత్రం 5.26 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్..
4,410 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎమ్ఎస్-03..
చంద్రయాన్-3 మిషన్‌కు వాడిన రాకెట్‌తోనే ఈ ప్రయోగం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 2 (అఖండ భూమి న్యూస్ );
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి సాయంత్రం అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎమ్ఎస్-03ను ప్రయోగించనుంది. భారత గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది కావడం విశేషం. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సజావుగా కొనసాగుతోంది.
మొత్తం 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ‘బాహుబలి’ అనే పేరున్న ఎల్వీఎమ్3-ఎమ్5 రాకెట్ ద్వారా భూస్థిర బదిలీ కక్ష్య లోకి ప్రవేశపెట్టనున్నారు. నేటి సాయంత్రం సరిగ్గా 5.26 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్‌ను జీఎస్ఎల్‌వీ మార్క్-3గా కూడా పిలుస్తారు.
సీఎమ్ఎస్-03 ఒక మల్టీ-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది భారత భూభాగంతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. అయితే, దీనిని సైనిక నిఘా అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చనే అంచనాలున్నప్పటికీ, ఇస్రో ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు.
ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం 5,854 కిలోల జీశాట్-11. అయితే, దానిని 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి విదేశీ రాకెట్ ద్వారా ప్రయోగించారు. కానీ, పూర్తిగా స్వదేశీ గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న వాటిలో మాత్రం సీఎమ్ఎస్-03నే అత్యంత బరువైనది. 4,000 కిలోల బరువైన ఉపగ్రహాలను సైతం మోసుకెళ్లే సామర్థ్యమున్న ఎల్వీఎమ్3 రాకెట్‌తో ఇస్రో పూర్తి స్వయంసమృద్ధి సాధించింది.
గతేడాది చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది కూడా ఇదే ఎల్వీఎమ్3 రాకెట్. ఈ రాకెట్ ద్వారా చేపడుతున్న ఐదో ఆపరేషనల్ ఫ్లైట్ ఇది. ప్రస్తుతం రాకెట్‌ను ప్రయోగ వేదికపైకి చేర్చి, అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
You may also like
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి *ఆపరేషన్ సింధూర్ పై* అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మ దహనం..!
మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు..!
ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులివ్వాలి…
విద్యా మానసిక వికాసానికి దోహదం చేస్తే, క్రీడలు శరీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.
పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన చంద్రశేఖర్ రెడ్డి…


