కొత్త వాహనాలపై అదనపు బాదుడు-ఏకంగా పది శాతం, ఉత్తర్వులు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కొత్తగా కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాలపై రవాణాశాఖ వసూలు చేసే జీవిత పన్ను (లైఫ్ ట్యాక్స్)పై..
అదనంగా 10 శాతం మేర రహదారి భద్రత సెస్ను విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసింది. దీంతో.. ఇక నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారి పైన అదనపు భారం పడనుంది. కొత్త పన్ను వివరాలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం సొంత(వైట్ బోర్డు) వాహనాల జీవితకాల పన్ను(లైఫ్ ట్యాక్స్)పై 10శాతం సెస్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ఏపీ రవాణా శాఖ సిద్ధమైంది. ఈ మేరకు అదనపు సెస్ వసూలుకు సంబంధించి ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం-1963ను సవరిస్తూ రవాణా శాఖ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. అనంతరం.. మంత్రి మండలి నిర్ణయాన్ని గవర్నర్కు పంపించడంతో ఈ మేరకు న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో లైఫ్ ట్యాక్స్ చెల్లించే వాహనాలు ఇకపై అదనంగా 10 శాతం రహదారి భద్రతా సెస్సును చెల్లించాల్సి ఉంటుందని ఆర్డినెన్స్ లో స్పష్టం చేసారు. వాహనాల కొనుగోలు దారులు ఆయా వాహనాల ధరపై కనిష్ఠంగా 9 శాతం నుంచి గరిష్ఠంగా 18 శాతం జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక, ఉత్తర్వులు..!!
కాగా, ఇప్పుడు లైఫ్ ట్యాక్స్పై 10 శాతం సెస్సుగా చెల్లించాలి. ఉదాహరణకు రూ.లక్షకు పైగా ఖరీదైన బైకు కొనుగోలు చేసే వారు 12 శాతం లైఫ్ ట్యాక్స్(రూ.12 వేలు)తో పాటు అదనంగా రూ.1200 సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ.25 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసే వారు 18శాతం లైఫ్ ట్యాక్స్(రూ.4.50 లక్షలు)తో పాటు మరో రూ.45 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయమై ఇటీవల రవాణా శాఖ వివరణ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా 28 శాతం జీఎస్టీని 18శాతానికి తగ్గించిందని..
రోడ్డు భద్రత కోసం విధిస్తున్న సెస్ చాలా చిన్న మొత్తమేనని తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో వసూలు చేసే 10 శాతం సెస్సును రహదారి భద్రతను పటిష్ఠపరిచేందుకు వినియోగించాలని నిర్ణయించింది.
ఈ నిధులతో రహదారుల మరమ్మతులు, బ్లాక్ స్పాట్స్ తొలగింపు, సిగ్నలింగ్ వ్యవస్థ బలోపేతం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.


