పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 
– లక్ష రూపాయల జరిమానా.
• కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,
కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 21. (అఖండ భూమి న్యూస్);
ఫిర్యాదుదారురాలు తేదీ 05-08-2022 నాడు తన కుమార్తె ఉదయం ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు తెలిపింది. అయితే సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్కూల్‌కు వెళ్లి విచారించగా, ఆమె ఆ రోజు స్కూల్‌కు రాలేదని తెలిసింది. దీంతో బంధువుల ఇళ్లలో, సమీప గ్రామాల్లో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. అనంతరం ఫిర్యాదుదారురాలు తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసు వివరాల్లోకి వెళితే..,
మహమ్మద్ అబ్దుల్ రహీం (20), తండ్రి మహమ్మద్ అమీర్ హుస్సేన్, ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అప్పుడప్పుడు టెంట్ హౌస్‌లో కూడా పనిచేస్తుండేవాడు. టెంట్ హౌస్ సమీపంలోని ఐస్‌క్రీమ్ దుకాణానికి మైనర్ బాలిక తరచూ రావడం గమనించిన నిందితుడు, ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ చనువు పెంచుకున్నాడు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పదవ తరగతి చదువుతున్న అమాయక బాలికను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి “నిన్ను పెళ్లి చేసుకుంటాను” అని నమ్మబలికాడు. బాలిక తాను మైనర్‌నని, తన వెంట పడవద్దని పలుమార్లు చెప్పినా వినకుండా, ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని పథకం పన్నాడు.
తన మాటలను నమ్మిన బాలిక వయసు రీత్యా ఏమి జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితిని ఆసరాగా తీసుకుని, నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ముందస్తు ప్రణాళికతో ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించుకుని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, భయపెట్టి బలవంతంగా లైంగికంగా వేధించాడు.
05-08-2022 నాడు స్కూల్‌కు వెళ్తున్న సమయంలో మాయమాటలు చెప్పి మైనర్ బాలికను కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ కొంతకాలం వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఆమెపై లైంగిక వేధింపులను కొనసాగించాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, చివరకు ఢిల్లీలో మైనర్ బాలికను గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలను విచారించి నిందితుడు మహమ్మద్ అబ్దుల్ రహీం, తండ్రి అమీర్ హుస్సేన్, తాడ్వాయి గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించి పోక్సో చట్టం మరియు ఎస్సీ/ఎస్టి చట్టం కింద కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (రేప్ & పోక్సో కేసుల విచారణ కోర్టు) జిల్లా న్యాయమూర్తి డా. సిహెచ్. వివిఆర్ వరప్రసాద్ నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయని తేల్చి, అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించి, బలమైన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించిన అప్పటి డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ప్రస్తుత డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు, పోలీసు తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె. శేషు, సూర్యప్రసాద్, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ వై. నరేష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ టి. సాయిబాబులను జిల్లా ఎస్పీ అభినందించారు.
You may also like
*ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు: రోగులకు పండ్ల పంపిణీ…*
ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు – కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం 22 న సత్య కన్వెన్షన్ హాల్
దోమకొండ లో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి…
*స్పోర్ట్స్ డేలో స్వర్ణం సాధించిన జనగామ రోహిన్ రెడ్డి…


