తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
• అమరవీరుల పోరాటం, ఆత్మత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది
• జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 02. (అఖండ భూమి న్యూస్) ;
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కామారెడ్డి జిల్లా క్యాంపు కార్యాలయం మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, జాతీయ జెండాను ఆవిష్కరించి,పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అవతరించి 12 వసంతాలు పూర్తి చేసుకొని, నవశకానికి నాంది పలుకుతూ 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరులు చేసిన ఆత్మబలిదానాలు, మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. తెలంగాణ బిడ్డలుగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
జిల్లా పోలీసు శాఖ తరపున కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా వివిధ రకాల ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టం కింద నమోదవుతున్న నేరాలు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్, ఆర్‌ఎస్‌ఐ శైలూ, ఎస్‌ఐలు మరియు జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


