ఫరీద్ పేట్ రెడ్డి కళ్యాణ మండపంపై కలెక్టర్ కొరడా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 6 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామంలోని “రెడ్డి కళ్యాణ మండపం / రెడ్డి సంక్షేమ సంఘం” భవనంపై జిల్లా కలెక్టర్ (పంచాయతీ విభాగం) కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మించబడినట్లు విచారణలో గుర్తించిన ఈ భవనానికి గత ఐదేళ్ల పన్ను జరిమానాను వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి ప్రజావాణి ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. డివిజనల్ పంచాయతీ అధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా, ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్డి కళ్యాణ మండపం గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతి పొందకుండా నిర్మించబడినట్లు, అలాగే ఇప్పటి వరకు భవనానికి పన్ను అంచనా కూడా చేయలేదని తేలినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అధికారుల పరిశీలనలో ఈ భవనం వివాహాలు, సామాజిక కార్యక్రమాలు, కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అయినప్పటికీ, గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం అవసరమైన పన్నులు చెల్లించకపోవడం, నిర్మాణ అనుమతులు పొందకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018లోని సెక్షన్ 65 ప్రకారం, భవనానికి తక్షణమే పన్ను నిర్ధారణ చేసి గత ఐదేళ్ల బకాయి పన్నుతో పాటు వర్తించే జరిమానాను వసూలు చేయాలని ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి , మండల పంచాయతీ అధికారిని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆదేశించింది.
వసూలు ప్రక్రియ పూర్తయిన అనంతరం పూర్తి నివేదికను జిల్లా కార్యాలయానికి సమర్పించాలని కూడా సూచించినట్లు సమాచారం.
ఈ వ్యవహారం ప్రస్తుతం ఫరీద్‌పేట్ గ్రామంలో చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.



