జర్నలిజం సేవలకు గౌరవ డాక్టరేట్..
-డాక్టర్ చేట్టబోయిన స్వామి ముదిరాజ్‌కు న్యూఢిల్లీలో అరుదైన గౌరవం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 14 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక సేవకుడు డాక్టర్ చేట్టబోయిన స్వామి ముదిరాజ్‌కు గౌరవ డాక్టరేట్ లభించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. జర్నలిజం రంగంలో విశిష్ట సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో ఈ అరుదైన గౌరవాన్ని ప్రదానం చేశారు.
మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఫరీదాబాద్‌లో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చేట్టబోయిన స్వామి ముదిరాజ్‌కు జాతీయ పురస్కారంతో పాటు గౌరవ డాక్టరేట్‌ను ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు.జర్నలిజం రంగంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సామాజిక చైతన్య కార్యక్రమాలను ప్రోత్సహించడం, ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందించడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలో పలు ప్రముఖ దినపత్రికల్లో విలేకరిగా సేవలందించిన ఆయన ప్రస్తుతం సొంత పత్రికను నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
అలాగే బీసీ సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ యువత అభివృద్ధి, సామాజిక సంక్షేమం, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు, పేదలకు సహాయ సహకారాలు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సమాజానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించిన నిర్వాహకులు ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టు మిత్రులు, సామాజిక కార్యకర్తలు, బీసీ సంఘ నాయకులు, గ్రామ పెద్దలు మరియు కొండాపూర్ గ్రామస్తులు డాక్టర్ చేట్టబోయిన స్వామి ముదిరాజ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా సమాజ సేవ, జర్నలిజం రంగాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ గౌరవం కామారెడ్డి జిల్లాకు, ముఖ్యంగా రాజంపేట మండలానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని అన్నారు.


