*మునగ ఉత్పత్తులతో ఆరోగ్య విప్లవానికి శ్రీకారం…
ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా యువ పారిశ్రామికవేత్త నిఖిల్ కంధూరి వినూత్న ప్రయత్నం..
కామారెడ్డి, జిల్లా ప్రతినిధి; జూన్ 17 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణానికి చెందిన సీపీఎం నాయకులు చంద్రశేఖర్ కుమారుడు నిఖిల్ కంధూరి హోటల్ మేనేజ్‌మెంట్‌లో పట్టా పొంది, అనంతరం ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం అనంతరం అంతర్జాతీయ క్రూయిజ్ లైన్స్‌లో ఉద్యోగం చేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విదేశాల్లో పనిచేసిన సమయంలో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించిన ఆయన, ఆ అనుభవాన్ని ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా మలచాలనే సంకల్పంతో స్వదేశానికి వచ్చి *”నిఖిల్ డీహైడ్రేటెడ్ ఫుడ్స్” ఆధ్వర్యంలో “కంధూరీస్ ఫామ్ ప్రొడక్ట్స్”* సంస్థను ప్రారంభించారు.
ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీ లాలు నాయక్ సంస్థను ప్రారంభించి, యువత స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని సూచించారు, రచన మేడం ప్రాజెక్టు సక్సెస్ కావడానికి పూర్తి సహకారాన్ని అందించారు*.
ప్రస్తుతం ప్రజలు ఫాస్ట్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ ఆహారాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మునగ ఆధారిత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిఖిల్ కంధూరి తెలిపారు. మునగలో సమృద్ధిగా ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయని పేర్కొన్నారు.
ఈ సంస్థ ద్వారా మునగ ఆకు పౌడర్, మునగ ఆకు పప్పుల పొడి మిక్స్, మునగ ఆకు కారం పొడి మిక్స్ వంటి ఆరోగ్యకర ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. ఫ్రమ్ ఓవర్ ఫారం టు యువర్ ఫ్యామిలీ అనే నినాదంతో నాణ్యమైన, సహజసిద్ధమైన ఆహార ఉత్పత్తులను ప్రతి ఇంటికి చేరవేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రజల్లో పెంపొందించడం, రోగనిరోధక శక్తిని పెంచే సహజ ఉత్పత్తులను అందించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ భవిష్యత్ లక్ష్యాలని నిఖిల్ కంధూరి తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు నిఖిల్ కంధూరికి శుభాకాంక్షలు తెలియజేసి, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ స్వస్థలంలో ఆరోగ్యకర ఆహార ఉత్పత్తుల పరిశ్రమను స్థాపించడం అభినందనీయమని కొనియాడారు.


