విద్యతోనే విద్యార్థులకు బలమైన పునాది…
బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 18 (అఖండ భూమి న్యూస్);
జిల్లాలోని గర్గుల్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూకేజీ తరగతిని ప్రారంభించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
అనంతరం సంచారజాతుల పిల్లలను పాఠశాలలో చేర్పించి వారికి అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో రెండు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. హైస్కూల్ , ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
గర్గుల్ పాఠశాలకు చెందిన నలుగురు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులు, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న 12 మంది క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సన్మానించి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూనే విద్యలో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ శ్రీమతి దివ్య రవితేజ గౌడ్ గ్రామంలో విద్యాభివృద్ధికి ప్రత్యేక బాధ్యత తీసుకుని చదువుకు ప్రాధాన్యత ఇస్తుండటం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల ప్రగతి కోసం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రతి చిన్నారి విద్యను అభ్యసించేలా అందరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, ఎంఈఓ ఎల్లయ్య, ఎంపీడీవో, సర్పంచ్ దివ్య రవితేజ గౌడ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పి.డి. మధుసూదన్, సీఆర్పీ రాములు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.


