కడప జిల్లా అఖండ భూమి వెబ్ న్యూస్ :
తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు రెచ్చిపోయారు. మార్గమధ్యలో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది..
వివరాలు.. తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రాత్రి 7:30 గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ దాదాపు గంట ఆలస్యంగా అక్కడి నుంచి రైలు కదిలింది. అయితే కమలాపురం రైలు నిలయం దాటిన తర్వాత రైలు ఆగింది. అప్పుడు 20 నుంచి 25 మంది దొంగలు ట్రైన్‌లో ఎక్కినట్టుగా చెబుతున్నారు.. ఎస్1 నుంచి ఎస్6 వరకు ఉన్న బోగీల్లో పలువురు ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
అయితే దోపిడీని ప్రతిఘటించేందుకు యత్నించినవారిపై దాడికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో పోలీసులు బోగీల్లో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రిపూట రైళ్లలో భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.