భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం …
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..
*భూ భారతి అమలుకు భూ రీ-సర్వేనే కీలకం..
మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి..
*రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.60 చెల్లింపు..
*సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి..
*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రెండు పడక గదుల ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి..
*భూ రీ-సర్వే, సాదాబైనామా దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూలై 11 (అఖండ భూమి న్యూస్);
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* అధికారులను ఆదేశించారు.
భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ, విద్యార్థుల యూనిఫాంల పంపిణీ, తదితర అంశాలపై *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* శనివారం, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్* ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ వి.విక్టర్, ఆర్ డి ఓ. ఎన్ వై గిరి, ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో *మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయిన ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపినారు.
ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, లీగల్ సమస్యలను పరిష్కరించి నాము.
దరఖాస్థుల తిరస్కరణలకు గల కారణాలను తెలియజేయాలని, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందుకోసం శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు.
శుక్రవారం, ముఖ్యమంత్రి ఆయా గ్రామాల రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
రీ-సర్వేకు అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని, కొనుగోలు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
కలెక్టర్లు భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని, అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పురోగతిని సమీక్షిస్తామని, మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూలై 28లోపు విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. వారికి బీమా, సామాజిక భద్రత కల్పించే చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు.
ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి, నోటీసులు త్వరితగతిన జారీ చేయాలని సూచించారు.
పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన 6,500 రెవెన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు భూ రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు అనంతరం నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.
. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హుల ఇళ్లను కూడా రెండో విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు.
ఇసుక, కంకర సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో *రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్* మాట్లాడుతూ.. తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీ-సర్వేను నవంబర్‌లోపు పూర్తి చేయాలని, రెండో విడతలో మరో 70 గ్రామాల్లో మార్చి 2027లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ-సర్వే పూర్తయితే సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.
అదే విధంగా *తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్* మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సుమారు 41 వేల గుడిసెలను గుర్తించామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి రెండు లక్షల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, పెండింగ్‌లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు.
అలాగే *సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్* మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థుల ఏకరూప దుస్తులన్నీ స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారానే కుట్టిస్తున్నామని తెలిపారు. టెండర్ ఆలస్యంతో వస్త్రం ఆలస్యంగా వచ్చినప్పటికీ జూలై 15లోపు రెసిడెన్షియల్ బాలికలకు, జూలై 30లోపు బాలురకు యూనిఫాంలు అందించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా కలెక్టర్లు, డీఆర్‌డీఏ, గురుకులాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 26 వేల మంది శిక్షణ పొందిన స్వయం సహాయక సంఘాల టైలర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
*దశాబ్దాల పోరాటానికి మద్దతు ఇవ్వాలి…
కామారెడ్డి జిల్లా దళిత సంఘం జిల్లా అధ్యక్షులు గా సబ్బని స్వామి…
ఎల్లారెడ్డి బావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం…
పర్ఫ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్ ఫుల్ ఫిమేన్
ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులను పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ…


