ఆర్‌-5 జోన్‌లో పట్టాల పంపిణీ.. నల్లబెలూన్లతో రాజధాని రైతుల నిరసన..

 

 

ఆర్‌-5 జోన్‌లో పట్టాల పంపిణీ.. నల్లబెలూన్లతో రాజధాని రైతుల నిరసన..

తుళ్లూరు: ఆర్‌-5 జోన్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు..

తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి నేడు సీఎం జగన్‌ రానున్న నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. పేదలకు పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు..

వెలగపూడిలోని దీక్షా శిబిరం వద్ద రైతులు నల్లబెలూన్లు, నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. తుళ్లూరులో ఇళ్లు, దుకాణాలపై నల్ల జెండాలు ఎగురవేశారు. దీక్షా శిబిరం వద్ద ఉరితాళ్లతో నిరసన తెలిపారు. తమను మోసం చేయొద్దని.. సీఎం జగన్‌ మొండి వైఖరిని నశించాలన్నారు. పేదలారా.. మరోసారి మోసపోవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతిని విచ్ఛిన్నం చేసే సీఎం గో బ్యాక్‌, రాజధాని ద్రోహులు గో బ్యాక్‌, అమరావతిని నిర్మించండి.. ఆంధ్రప్రదేశ్‌ కాపాడండి అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మందడంలోని దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులు బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో సుమారు 3వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి రైతుల ఆందోళనపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు..

Akhand Bhoomi News

error: Content is protected !!