కొత్త పార్లమెంట్ ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, జేడీయూ, ఆప్, వామపక్షాలు వంటి 20 ప్రతిపక్ష పార్టీలు హాజరుకాలేదు. బీఎస్పీ, బీజేడీ, అకాలీదల్, టీడీపీ, వైసీపీ వంటి 25 పార్టీలు హాజరవుతున్నట్లు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశాయి.
Read Also: New Parliament Inauguration:
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ‘‘రాష్ట్రీయ జనతాదల్(ఆర్జేడీ)’’ కొత్త పార్లమెంట్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కొత్త పార్లమెంట్ శవపేటికలా ఉందని ఆర్జేడీ ట్వీట్ చేసింది. దీనికి అంతే స్ట్రాంగ్ గా బీజేపీ స్పందించింది. ఈ వ్యాఖ్యలపై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ విమర్శించింది. బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి,బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ.. ఇంతకన్నా దురదృష్టం ఏం ఉండదని, వారికి మెదడు లేదని విమర్శించారు. ఆర్జేడీ పార్లమెంట్ ను శాశ్వతంగా బహిష్కరించాలని చూస్తుందా…? వారి ఎంపీలు రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ దేశానికి గర్వకారణం.. ఇలాంటి వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. 2024లో దేశ ప్రజలు మిమ్మల్ని ఒకే శవపేటికలో పాతిపెడతారని, ప్రజాస్వామ్యం అనే కొత్త దేవాలయంలోకి అడుగుపెట్టే అవకాశం ఇవ్వరని, పార్లమెంటు భవనం దేశానిదని అన్నారు. ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. మా ట్వీట్ లో శవపేటిక ప్రజాస్వామ్యాన్ని ఖననం చేయడాన్ని సూచిస్తోందని, పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, చర్చలకు వేదిక, అయితే బీజేపీ దాన్ని వేరే మార్గంలో తీసుకెళ్తోందని, దేశం దీన్ని అంగీకరించదని అన్నారు. రాష్ట్రపతిని పిలవకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆయన అన్నారు.



