ఆ నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టి…

ఆ నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టి

వచ్చే ఎన్నికల్లో విజయమే ప్రధాన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు..

తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. అసమ్మతి నాయకులుంటే వారిని బుజ్జగించడానికి కూడా సమయం సరిపోతుందనే భావనలో ఉన్నారు. అలాగే పనిచేయనివారికి టికెట్ ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు..

సత్తెనపల్లిలో టికెట్ కోసం పోరు : తాజాగా చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం, మాజీ ఎమ్మెల్యే చలపతి ఆంజనేయులు, తెలుగు యువత నాయకుడు అబ్బూరి మల్లి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ నాయకుల మధ్య టికెట్ కోసం జరుగుతున్న పోరుతో సత్తెనపల్లి నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది..

నాన్చుడు ధోరణివల్లే : టికెట్ విషయంలో చంద్రబాబు మరోసారి తన నాన్చుడు ధోరణి వల్లే ఇక్కడ అభ్యర్థి ఎవరనేది తేలకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గానికి కర్చీఫ్ వేశారనే వార్తలు వస్తున్నాయి. కన్నా సీటుకోసం బరిలోకి దిగితే మిగతా నాయకులు సైడవక తప్పదు. కానీ వారు కన్నాకు సహకరిస్తారా? లేదా? అనేది కాలమే నిర్ణయించనుంది. సత్తెనపల్లి, పెదకూరపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో కన్నాకు అనుచర వర్గం ఉంది..

విజయమే ప్రధాన లక్ష్యంగా.. : పెదకూరపాడుకు కొమ్మాలపాటి శ్రీధర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. తాడికొండ కు శ్రావణ్ కుమార్ ఉన్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు, సీఆర్డీయే రీజియన్ ను ఆనుకొని ఉన్న నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ మినహా మిగతావాటిల్లో ఓటమిపాలైంది. రాజధాని ప్రాంతానికి దగ్గరగా ఉండే నియోజకవర్గాల్లో ఈసారి విజయమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. మరోవిడత మంగళగిరి, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది..

Akhand Bhoomi News

error: Content is protected !!