కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్..!

 

Kedarnath: కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్..!

దేహ్రాదూన్‌: ఉత్తరాఖాండ్‌లో (Uttarakhand) భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది..

ప్రసిద్ధ కేదార్‌నాథ్‌ (kedarnath) యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యాత్రకు అనుమతించొద్దని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి (Pushkar Singh Dhami) అదేశించారు. ఈ మేరకు రుద్రప్రయాగ కలెక్టర్ మయూర్‌ దీక్షిత్‌ వెల్లడించారు. ఇప్పటికే బయల్దేరి వెళ్తున్న యాత్రికులను సోన్‌ప్రయాగ వద్ద నిలిపివేశారు. వారు తలదాచుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

మరోవైపు రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సీఎం పుష్కర్‌ సింగ్‌ధామి అకస్మాత్తుగా సందర్శించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సన్నద్ధతపై ఆరా తీశారు. ఇవాళ ఉదయం 8 గంటల వరకు 5828 మంది యాత్రికులు సోన్‌ప్రయాగ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. కేవలం రుద్రప్రయాగ, సోన్‌ప్రయాగ, కేదార్‌నాథ్‌ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ చోట్ల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!