ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలమూరులోనే కొనసాగుతుంది.
ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి హామీ.
ఆలమూరు (అఖండ భూమి):అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడికి తరలిపోదని కొత్తపేట శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.ఆయన ఆదివారం ఆలమూరులో జరిగిన గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్తకార్యదర్శి,పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు స్వగృహం నందు ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమలాపురం తరలించే ప్రసక్తే లేదని మీడియాకు వెల్లడించారు.సంక్షేమ,అభివృద్ధి నిరోధకులైన ప్రతిపక్షాలు ఆరోపణలు,దుస్ప్రాచారంను ప్రజలు నమ్మవద్దన్నారు.విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ విద్యాశాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ దృష్టికి తీసుకు వెళ్ళి నిలిపి వేయించామన్నారు.డిగ్రీ కళాశాల యధావిధిగా నడుస్తుందని ఆయన భరోసా కల్పించారు.కళాశాల అభ్యున్నతికి ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే గతంలో తమ తండ్రి హయాంలో కొత్తపేట విద్యుత్ డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయం తరలింపు నిలిపివేశామన్నారు.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యాలయాన్ని అమలాపురం తరలించారు అన్నారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక అభివృద్ధి కార్యకలాపాలు చేసామని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని కొత్తపేటలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్,వైస్ ఎంపీపీ వాసంశెట్టి దుర్గా భవాని,ఎంపీటీసి వున్నమట్ల విజయ కుమారి,వైసిపి ఆలమూరు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రావాడ సత్తిబాబు,ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి( దొరబాబు),మీడియా కో ఆర్డినేటర్ చల్లా నానాజీ,దూలం సత్తిబాబు,వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



