స్పీకరే ఈ సభకు సంరక్షకుడు.. ఆయన్ను రమ్మనండి..!

 

Parliament: స్పీకరే ఈ సభకు సంరక్షకుడు.. ఆయన్ను రమ్మనండి..!

దిల్లీ: ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్(Parliament) కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఉభయ సభలను మణిపుర్(Manipur) అంశం కుదిపేస్తోంది. ఆ రాష్ట్రంలో ఘర్షణలపై గురువారం కూడా విపక్ష సభ్యులు(Opposition MPs) నిరసనలు కొనసాగించడంతో లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది..

ప్రస్తుతం రాజ్యసభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

మణిపుర్ అంశంపై చర్చను ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన మార్గాలపై మాట్లాడేందుకు మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం అవుదామని రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభ్యులను కోరారు. దానిపై సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. అప్పటి వరకు సభను వాయిదా వేయాలని కోరారు. అలాగే మణిపుర్‌పై చర్చ విషయంలో ఛైర్మన్ ఎందుకు ప్రధానిని కాపాడుతున్నారని ఖర్గే ప్రశ్నించారు. ‘నేను ఎవరిని రక్షించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని, సభ్యుల హక్కులను కాపాడటమే నా విధి. మీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు’ అని ఛైర్మన్ ఘాటుగా బదులిచ్చారు..

ఆయనే ఈ సభ సంరక్షకుడు..

లోక్‌సభ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎంపీల తీరుపై అసంతృప్తితో ఉన్న స్పీకర్ ఓం బిర్లా(Om Birla) సభకు హాజరుకావడం లేదు. ఆయన రాకపోవడంతో నిన్న, నేడు ఆ బాధ్యతలను ఇతర సీనియర్‌ ఎంపీలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా రాజేంద్ర అగర్వాల్ దిగువ సభను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఓ అభ్యర్థన చేశారు. ఓం బిర్లా సభకు వచ్చేలా చూడాలని రాజేంద్ర అగర్వాల్‌ను కోరారు. ఆయనే ఈ సభకు సంరక్షకుడని అన్నారు. దీనిపై అగర్వాల్ స్పందించారు. ‘మీ అభ్యర్థనను ఆయనకు వెల్లడిస్తాను’ అని చెప్పారు.

Akhand Bhoomi News

error: Content is protected !!