గురుకుల పాఠశాలకు గ్రామసభ తీర్మాన్ని ఇవ్వండి…
తెదేపా మండల కన్వీనర్ టి.బలరాం గౌడ్
అఖండ భూమి వెబ్ న్యూస్ :-
మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలకు స్థల సేకరణ నిమిత్తం గ్రామసభ తీర్మానం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ టి బలరాం గౌడ్ జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ ను కోరారు. మంగళవారం ఈ మేరకు ఆయన వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా పట్టణంలో జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల అద్దె భవనంలో కొనసాగిస్తున్నారని, పాఠశాల సొంత భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని పత్తికొండ ఎమ్మెల్యే కే. ఈ శ్యామ్ కుమార్ ను కోరమన్నారు. అయితే పేద విద్యార్థులకు ఉపయోగపడే పాఠశాల సొంత భవన నిర్మాణానికి స్థల సేకరణకు ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను ఆదేశించగా సర్వే నెంబర్ 1221/1, 1221/2 12 ఎకరాల భూమిని సేకరించారని అన్నారు. సదరు భూమిని గతంలో ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగిందని వీటిని మార్చేందుకు గ్రామ సభ తీర్మానం అవసరమైందని అన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న గ్రామ సర్పంచ్ వైసీపీ పార్టీకి చెందినవారు కావడంతో తీర్మానం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని అన్నారు. దీంతో రెవెన్యూ అధికారులు జిల్లా ఉన్నత అధికారులకు అప్రూవల్ కి పంపడానికి వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి సర్పంచు లేకుండా గ్రామసభ తీర్మానం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పట్టణ అభివృద్ధిలో భాగమైన పాఠశాల నిర్మాణంకు సహకరించాలని ఆయనను కోరారు. దీనికి స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి పనులకు అడ్డుపడితే ఊరుకునేది లేదని అన్నారు. వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేసే కోరంతో తీర్మానాన్ని పంపించాలని అధికారులను ఆదేశించారు . ఈ కార్యక్రమంలో తెదేపా మండల నాయకులు రామలకోట రామకృష్ణ ఆచారి, గుంటుపల్లి వెంకట్రాముడు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.