చివరి గింజ వరకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు…..

 

చివరి గింజ వరకు మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు….. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి…

హమాలీలు, రవాణా వాహనాల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు..

ధాన్యం కొనుగోలు, రేషన్ కార్డుల జారీపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 16 (అఖండ భూమి న్యూస్) :

యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

 

శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్. చౌహాన్ లతో కలిసి ధాన్యం కొనుగోలుపై శుక్రవారం

జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

 

ఈ సందర్భంగా *మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ* రైతులు పండించిన ప్రతి గింజ మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, మన దగ్గర రికార్డ్ స్థాయిలో 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు జరిగిందని, ప్రభుత్వం దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసిన 48 గంటల్లో రైతులకు ఖాతాలో డబ్బు జమ అవుతుందని అన్నారు. భారీ స్థాయిలో కొనుగోలు జరుగుతున్నప్పటికీ మీడియాలో సరిగ్గా కవర్ కావడం లేదని అన్నారు. పత్రికలలో వచ్చే నెగటీవ్ వార్తలపై స్పందించాలని, సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలని అన్నారు.

 

రాబోయే 15 రోజులలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు, రవాణా వాహనాల కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

 

కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగ్ లు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటు లో పెట్టాలని అన్నారు. రైస్ మిల్లర్లతో కలెక్టర్, ఉన్నతాధికారులు చర్చించాలని, జిల్లాలలో అవసరమైతే ఇంటర్మీడియట్ గోదాములకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని అన్నారు. అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.

 

2025, జనవరి 26 తర్వాత మన రాష్ట్రంలో నూతనంగా 1,57,467 రేషన్ కార్డులను పంపిణీ చేశామని, మీసేవ కేంద్రాలు, ప్రజాపాలన కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.

 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ధాన్యం పెండింగ్ లో ఉన్నదని, కొనుగోలు సజావుగా పూర్తి చేయాలని, మిల్లర్ల వద్ద తరుగు తీయకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. రవాణా కాంట్రాక్టర్ లతో చర్చించి నిర్దేశించిన మేర వాహనాలు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అన్నారు.

 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,* ధాన్యం కొనుగోలు అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని, రైస్ మిల్లుల వద్ద తరుగు లేకుండా చూడాలని అన్నారు. గన్ని బ్యాగులు సమస్య రాకుండా చూసుకోవాలని, రవాణా సమస్యలు ఏవైనా ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని మంత్రి తెలిపారు.

 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు మాట్లాడుతూ* ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కలెక్టర్లు ప్రణాళిక బద్దంగా యాసంగి పంట కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెగ్యులర్ గా కలెక్టర్లు తనిఖీ చేయాలని, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే చిన్న, చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.

 

ప్రతి రోజు జరుగుతున్న కొనుగోలు ప్రక్రియ పురోగతిపై మీడియాకు సమాచారం అందించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు వస్తే వెంటనే పరిష్కరించి ఆ సమాచారం కూడా రైతులకు మీడియా ద్వారా తెలియ జేయాలని అన్నారు.

 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *పౌర సరఫరాల శాఖ కమీషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ* రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల 70 వేల 477 మంది రైతుల నుంచి 49 .53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8 వేల 42 కోట్లు మద్దతు ధర క్రింద చెల్లించామని అన్నారు.

 

గతం కంటే అధికంగా ఈ యాసంగి సీజన్ లో మనం ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. మే 15 నాటికి 2022-23 రబీ సీజన్ లో 25.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 2023-24 రబీ సీజన్ లో 32.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, 2024-25 రబీలో 49.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. ప్రతి రోజు అదనపు కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. మే నెలాఖరు నాటికి పకడ్బందిగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు.

 

ధాన్యం రవాణాకు వాహనాల ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్, ఆర్.టి.ఓ , పోలీస్ అధికారులు సమన్వయంతో ఖాళీగా ఉన్న లారీలను పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు కేటాయించాలని అన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం బస్తాల అన్ లోడింగ్ ఆలస్యం కాకుండా చూడాలని, హమాలీల కొరత ఉండకుండా జాగ్రత్త పడాలని అన్నారు.

 

ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా మానిటర్ చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లు తాలు, తరుగు పేరు మీద ఎటువంటి కోతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు ఉండాలని రైతులకు నేరుగా ఇవ్వవద్దని, మనం కొనుగోలు చేసిన ధాన్యంనింపేందుకు మాత్రమే వినియోగించాలని అన్నారు.

 

గత ఆరు నెలల కాలంలో రేషన్ తీసుకోక పోవడం, ఇతర రాష్ట్రాలకు చెందిన డూప్లికేట్ బెనిఫిషరీ, చనిపోయిన వారి పేర్లు ఉండటం వంటి వివిధ కారణాల వల్ల భారత ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 96 వేల 240 రేషన్ కార్డుల పరిధిలోని లక్షా 62 వేల 777 మంది లబ్ధిదారులు అనుమానాస్పదంగా ఉన్నారని, జిల్లాల వారీగా సంబంధిత జాబితా అందించామని, వీటిపై విచారణ చేసి వివరాలు సమర్పించాలని కలెక్టర్ లకు సూచించారు.

 

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు ఏర్పాటు, టార్పాలిన్ లను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఆకాల వర్షాల కారణంగా ప్రతి కొనుగోలు కేంద్రం లో టార్పాలిన్ లను రైతులకు ఇచ్చేందుకు సిద్ధంగ ఉంచు కోవాలని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యం ను ట్యాబ్ ఎంట్రీ చేసి మిల్లులకు తరలించేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. వార్తా పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలకు ఏరోజు కారోజు రిజాయిండర్ లను పంపించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి కష్టం కలుగకుండా చూడాలని తెలిపారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, రైతుల సంఖ్య, చెల్లింపుల వివరాలను ఎప్పటికప్పుడు పత్రిక ప్రకటనలు జారీచేయాలని తెలిపారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్, డిపిఎం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!