ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలి…

 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 23 (అఖండ భూమి న్యూస్);

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ విలీన గ్రామంలోని నిరుపేద కుటుంబ యజమానురాలు కుంట్ల వినోద కు ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయగా శుక్రవారం కలెక్టర్ భూమి పూజ చేసి ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరైన ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రభుత్వం నుండి లబ్ది పొందాలని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు 708 ఇండ్లు మంజూరు కాగా, 74 ఇండ్లకు మార్క్ అవుట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

 

జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో 11,153 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో కామారెడ్డి నియోజక వర్గంలో 3206 ఇండ్లు, ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 3496, జుక్కల్ నియోజక వర్గంలో 3019, బాన్సువాడ నియోజక వర్గంలో 1432 ఇండ్లు మంజూరు చేయడం జరిగాయని తెలిపారు. ఇందులో 2250 ఇండ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాగా ముగ్గుపోయడం జరిగి, నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇందులో 127 ఇండ్లు బేస్మెంట్ స్థాయి వరకు ఇండ్లు నిర్మించుకోగా అందులో ఇప్పటి వరకు 75 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున మొదటి విడతలో మంజూరు చేయడం జరిగిందని, ముగ్గురు లెంటిల్ లెవెల్ వరకు నిర్మించుకోగా మరో లక్ష చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం ప్రతీ సోమవారం ఇండ్ల నిర్మాణాలకు అనుగుణంగా ఆయా స్టేజీల నిర్మాణాల మేరకు విడతల వారీగా నిధులు చెల్లించడం జరుగుచున్నదని తెలిపారు.

 

ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని నిరుపేద వర్గాల ప్రజలు ఇండ్ల నిర్మాణానికి ముందుకు రావాలని కలెక్టర్ పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్ పాల్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు, లబ్ధిదారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!