కామారెడ్డిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు…

కామారెడ్డిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 2 (అకాండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా ముఖ్య అతిథి సందేశం

పటేల్ రమేష్ రెడ్డి , గౌరవ చైర్మన్ తెలంగాణా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్

తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేఖరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయ పూర్వక నమస్కారాలు.

రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికి శుభాభినందనలు. ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమర వీరులందరికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.

తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈ రోజు మనం ఉత్సాహ పూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారు.

తెలంగాణ రైజింగ్-2047 కీలకాంశాలు:- తెలంగాణ రైజింగ్-2047 విజన్ లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టీస్ పాలసీ, గ్రీన్ ఎనర్జి పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది.

ఆడబిడ్డలకు అండదండలు

• ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే, రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.

• ఆర్టీసీ బస్సుల్లో ఉచితప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలతో పాటు, సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

• మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్ళను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయటం జరిగింది.

 

 

 

రైతులకు రుణ విముక్తి

• దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో 25 లక్షల 35 వేల 964 మంది రైతులను రుణవిముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణ మాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి, రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతోంది.

• గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు.

• అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇస్తున్నాం.

• సన్న ధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం.

• భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయటం జరుగుతోంది.

నిరుపేదలకు సన్నబియ్యం

• పేదల ఆకలి తీర్చటంతో పాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం పథకాలను అమలుచేస్తున్నాం.

ఎస్సీవర్గీకరణతో సామాజిక న్యాయం

• సంక్షేమంతోపాటు సామాజిక న్యాయంలో సయితం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ.

• పారదర్శకంగా కులగణన నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యువతకు ఉపాధి, ఉద్యోగాలు

• ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ, యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ప్రయివేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నాం.

• రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం.

• తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

• విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టాం

• 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం.

• పాఠశాలల అభివృద్ధికి విద్యాకమీషన్ ఏర్పాటుచేశాం.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం

• రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం.

• రాష్ట్రంలో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇల్ళ నిర్మాణం లక్ష్యం.

• రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణాల ప్రారంభం. నిర్మాణ దశలను బట్టి లబ్దిదారుల ఖాతాలలో నగదు జమ.

 

చెంచులకు ఇందిరమ్మ ఇళ్ళు

• గిరిజన ప్రాంతాలలోని చెంచులకు 10 వేల గృహాలు కేటాయింపు.

• గిరిజనుల భూములకు సాగునీరు, విద్యుత్ సదుపాయానికి “ఇందిర సౌర గిరి జల వికాసం” కార్యక్రమం ప్రారంభం

హైదరాబాద్ కు అంతర్జాతీయ హంగులు

• హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

• మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. జీ.హెచ్.ఎం.సి లో కంటోన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాం.

• ఫ్యూచర్ సిటీ పేరుతో 30 వేల ఎకరాలలో సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

• అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రాన్ని మూడు జోన్లుగా వర్గీకరించాం. అవుటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు- ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజినల్ రింగ్ రోడ్డు ఆవల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం.

• వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాం.

విశ్వ వేదికపై తెలంగాణ

• తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలలో పర్యటించి బారీగా పెట్టుబడులు సాధించాం.

• హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. AI గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం.

కామారెడ్డి జిల్లాలో వివిధ రంగాలలో సాధించిన ప్రగతి:-

ఇందిరా మహిళా శక్తి:- గ్రామీణ ప్రాంతాలలో 12 వేల 905 యూనిట్లను 169 కోట్ల 29 లక్షల రూపాయల పెట్టుబడితో మరియు పట్టణ ప్రాంతాలలో 149 యూనిట్లు 5 కోట్ల 76 లక్షల రూపాయల పెట్టుబడితో వివిధ రకములైనటువంటి వ్యాపార సంస్థలను ప్రారంభించడం జరిగింది.

రైతులు:- ప్రస్తుత యాసంగిలో 3 లక్షల 72 వేల 965 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 446 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసి 800 కోట్ల రూపాయలను 71 వేల 745 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది.

జిల్లాలో మొత్తం 446 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా అందులో ఐకెపి క్రింద, గతంలో 27 కేంద్రాల ద్వారా వరి కొనుగోలు చేపట్టడం జరిగేది కానీ ప్రస్తుత యాసంగి సీజన్ నుండి అట్టి కేంద్రాలను 183 కు పెంచడం జరిగింది. అంటే ఐకెపి క్రింద వరి ధాన్యం సేకరణ కేంద్రాలు 6 శాతం నుండి 41 శాతముకు పెంచడం జరిగింది. దీని వలన మహిళా సంఘాలకు 3 కోట్ల 20 లక్షల రూపాయల లబ్ది చేకూరింది.

జిల్లాలో 1 లక్ష 79 వేల 970 మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లను 27 వేల 795 మంది రైతుల నుండి కొనుగోలు చేయటమైనది. వీటికి సంబంధించి 83 కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుంది.

రైతులకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించుటకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 4 రైతు వేదికలలో దృశ్య శ్రవణ సౌఖర్యాన్ని కల్పించి 53 శిక్షణ కార్యక్రమములు నిర్వహించడం జరిగింది.

జిల్లాలో 480 ఎకరాలలో పంటలు నష్ట పోగా, 493 మంది రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున వారి ఖాతాలలో 48 లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది.

రైతు ఋణ మాఫీ:- కామారెడ్డి జిల్లాలో 1 లక్ష 1 వేయి 535 మంది రైతులకు 733 కోట్ల 22 లక్షల రూపాయలను ఋణ మాఫీ చేయడం జరిగింది.

రైతు బీమా:- జిల్లాలో 1 లక్ష 96 వేల 554 మంది రైతులు బీమాకు అర్హత కలిగి ఉన్నారు. ఈ సంవత్సరంలో మరణించిన 1 వేయి 72 మంది రైతులకు గాను 693 మంది రైతుల నామినీల ఖాతాలలో 34 కోట్ల 65 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది.

రైతు భరోసా:- రైతు భరోసా సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు 12 వేల రూపాయలకు పెంచడం జరిగింది. ప్రస్తుత యాసంగిలో 2 లక్షల 70 వేల రైతుల ఖాతాలలో 216 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది.

భూ భారతి:- 2020లో వచ్చిన ధరణి చట్టంలోని లోపాలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూ భారతి ROR – 2025 చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం నేటి నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా, సమగ్రంగా భూ వివాదాలకు తావులేకుండా, భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి. డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా, భూ భారతి లావాదేవీలను సులభతరం చేసి, సక్రమమైన భూ రికార్డు వ్యవస్థను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది. జిల్లాలోని లింగంపేట మండలంను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి 23 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇట్టి రెవెన్యూ సదస్సులలో రైతుల నుండి భూ సంబంధమైన సమస్యల పరిష్కార నిమిత్తము 4 వేల 225 ధరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ ధరఖాస్తులను క్షేత్ర స్థాయిలో విచారణ చేసి అన్ని ధరఖాస్తులను పరిష్కరించి, లింగంపేట మండలమును భూ వివాద రహిత మండలముగా చేయటం జరిగింది.

ఇందిరమ్మ ఇండ్లు:- జిల్లాలో 11 వేల 153 ఇండ్లు మంజూరు కాగా, 2 వేల 894 ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అందులో 144 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేయడం జరుగగా, ఇట్టి లబ్దిదారులకు ఇప్పటి వరకు 1 కోటి 9 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది.

అమృత్ 2.0:- జిల్లాలోని 3 పురపాలక సంఘములలో అమృత్ 2.0 పథకము క్రింద 180 కోట్ల రూపాయలతో చేపట్టబడిన నీటి సరఫరా పనులు పురోగతిలో కలవు

పౌర సరఫరా:-

జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2 లక్షల 56 వేల 732 రేషన్ కార్డుదారులకు ఏప్రిల్ మాసంలో 5 వేల 571 మెట్రిక్ టన్నులు మరియు మే మాసంలో 5 వేల 787 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయటం జరిగింది. జూన్, జూలై మరియు ఆగష్టు మాసాలకు గాను 17 వేల 711 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయటం ప్రస్తుతం జరుగుచున్నది.

500/-రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 50 వేల 131 మంది వినియోగదారులకు 5 లక్షల 58 వేల 981 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 16 కోట్ల 5 లక్షల రూపాయల సబ్సిడీ అందించింది.

తెలంగాణ అవతరించిన నాటి నుండి ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డుల కొరకు ఎదురు చూసినారు. అర్హులైన వారందరికి నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో 3 వేల 889 కొత్త కార్డులను మంజూరు చేయడం జరిగింది. దీని వలన 12 వేల 194 మంది లబ్ది పొందగలరు. అదేవిధంగా 45 వేల 344 మంది కుటుంబ సభ్యులను వారికి సంబంధించిన రేషన్ కార్డులలో జత చేయడం జరిగింది. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ.

యాసంగిలో పండిన జొన్నల కోసం 24 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 30 వేల 202 మెట్రిక్ టన్నుల జొన్నలను రైతుల నుండి కొనుగోలు చేసి, 102 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. అదే విధంగా 653 మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడును కొనుగోలు చేసి 5 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది.

జిల్లాలో గత ఖరీఫ్ సీజన్ లో ఒక లక్ష క్వింటల్లా ప్రత్తిని 5 వేల 67 మంది రైతుల నుండి కొనుగోలు చేసి 74 కోట్ల 72 లక్షల రూపాయలను రైతులకు చెల్లించడం జరిగింది.

చేయూత పథకము:- మన కామారెడ్డి జిల్లాలో అన్ని రకాల పింఛనులు కలిపి 1 లక్ష 62 వేల మంది పింఛను లబ్దిదారులకు ప్రతి నెల 36 కోట్ల 22 లక్షల రూపాయలు పంపిణీ చేయడము జరుగుచున్నది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం:- కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 4 కోట్ల 21 లక్షల 96 వేల “0”టికెట్ల ద్వారా మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా జిల్లాలోని మహిళలకు 137 కోట్ల రూపాయల లబ్ధిచేకూరింది.

గృహ జ్యోతి:- ఈ పథకం క్రింద కామారెడ్డి జిల్లాలోని 1 లక్ష 57 వేల 656 మంది వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ని అందించడం జరుగుతుంది. ఇందు కోసం ప్రభుత్వం 5 కోట్ల 68 లక్షల రూపాయలను ప్రతి నెల చెల్లించడం జరుగుచున్నది.

ఆరోగ్యం మరియురాజీవ్ ఆరోగ్య శ్రీ:- జిల్లాలో గత ఏడాది కాలంలో 17 వేల 611 మంది నిరుపేదలకు శస్త్ర చికిత్సలు మరియు చికిత్స గురించి 42 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగినది.

విద్య:- జిల్లాలో జుక్కల్ మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గంలలో 200 కోట్ల రూపాయల చొప్పున “యంగ్ ఇండియా ఇంటెగ్రటెడ్ రెసిడెన్షియల్ స్కూలు” నిర్మాణం కొరకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది.

2025-26 విద్యా సంవత్సరానికి గాను 5 లక్షల 30 వేల ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ మరియు ఏకరూప దుస్తులను 82 వేల 295 మంది విద్యార్థులకు అందించడం జరుగుతుంది.

డైట్ మరియు కాస్మోటిక్ చార్జిల పెంపు:- ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు సహాయం చేయడానికి డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మటిక్ చార్జీలను 200 శాతం పెంచుతూ, మెనూ చార్జీలను ఘననీయంగా పెంచి విద్యార్థులకు పౌష్టిక ఆహారము అందించడం జరుగుచున్నది. ఈ చార్జీల పెంపు వలన జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కళాశాలలలోని 7 వేల 63 మంది విద్యార్థులకు లబ్ది కలుగుతుంది. వీటి నిర్వహణ గురించి 59 కోట్ల 99 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.

పోలీసు శాఖ:- మన జిల్లాను నేర రహిత సమాజముగ మార్చడానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలతో పాటు మనందరి సహాయ సహకారాలు కూడా తోడు కావాలని ఈ సందర్భముగా కోరుకుంటున్నాను.

జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పటేల్ రమేష్ రెడ్డి, గౌరవ చైర్మన్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ , అదనపు కలెక్టర్ విక్టర్, అడిషనల్ లోకల్ బాడీ కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, అటవీ శాఖ అధికారి నిఖిత, ఆర్డిఓ వీణ, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!