ఇకపై చిప్‌తో కొత్త పాస్‌పోర్టులు.. ఏమిటీ ఈ-పాస్‌పోర్ట్? ఎలా పనిచేస్తుంది?

ఇకపై చిప్‌తో కొత్త పాస్‌పోర్టులు.. ఏమిటీ ఈ-పాస్‌పోర్ట్? ఎలా పనిచేస్తుంది?

దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవా 2.0 సేవలు ప్రారంభం

అందుబాటులోకి రానున్న చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులు

విదేశీ ప్రయాణాలు మరింత సురక్షితం, వేగవంతం

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అధికారిక ప్రకటన

బయోమెట్రిక్ వివరాలతో మోసాలకు అడ్డుకట్ట

విమానాశ్రయాల్లో వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 3 (అఖండ భూమి న్యూస్);

దేశంలో పాస్‌పోర్ట్ సేవల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టుగా కొద్ది నగరాలకే పరిమితమైన ‘ఈ-పాస్‌పోర్ట్’ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (పీఎస్‌పీ) 2.0’ కింద ఈ అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ గ‌త వారం అధికారికంగా వెల్లడించారు. 13వ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

 

అత్యాధునిక టెక్నాలజీతో పౌర సేవలు

ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడుతూ… “ప్రభుత్వం పౌర కేంద్రీకృత సేవలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగానే అత్యంత అధునాతన టెక్నాలజీతో కూడిన పీఎస్‌పీ 2.0ను దేశవ్యాప్తంగా ప్రారంభించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను” అని తెలిపారు. ‘సేవ, సుశాసన్, గరీబ్ కల్యాణ్’ స్ఫూర్తితో పాస్‌పోర్ట్ అధికారులు అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. ఈ కొత్త విధానం ప్రయాణికులకు పూర్తిస్థాయి డిజిటల్ ఇండియా అనుభూతిని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

ఏమిటీ ఈ-పాస్‌పోర్ట్? ఎలా పనిచేస్తుంది?

ఈ-పాస్‌పోర్ట్ అంటే ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్. ఇది సాధారణ పాస్‌పోర్ట్ పుస్తకంతో పాటు ఒక ఎలక్ట్రానిక్ చిప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ చిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్ వ్యక్తిగత వివరాలతో పాటు వారి బయోమెట్రిక్ సమాచారం (ఫొటో, వేలిముద్రలు) నిక్షిప్తం చేసి ఉంటాయి. పాస్‌పోర్ట్ ముందు కవర్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) చిప్, ఒక యాంటెన్నా పొందుపరిచి ఉంటాయి. సాధారణ పాస్‌పోర్ట్‌కు దీనికి తేడాను గుర్తించేందుకు ముందు కవర్‌పై ఒక చిన్న బంగారు రంగు చిహ్నం ముద్రించి ఉంటుంది.

 

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో పెద్దగా మార్పులు లేవు. ఆశావహులు అధికారిక పాస్‌పోర్ట్ సేవా ప్లాట్‌ఫామ్‌ను సందర్శించాలి.

* కొత్త వినియోగదారులు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పటికే అకౌంట్ ఉన్నవారు నేరుగా లాగిన్ అవ్వవచ్చు.

* ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫారం నింపి, సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీఎస్‌కే) లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో (పీఓపీఎస్‌కే) అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.

* నిర్ణీత ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

* షెడ్యూల్ చేసిన తేదీన పీఎస్‌కే లేదా పీఓపీఎస్‌కేకు వెళ్లి బయోమెట్రిక్ వివరాలు అందించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

 

 

ఈ-పాస్‌పోర్ట్‌తో ప్రయోజనాలెన్నో..

ఈ కొత్తతరం పాస్‌పోర్ట్‌ల వల్ల పౌరులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

అధిక భద్రత: చిప్‌లో వ్యక్తిగత, బయోమెట్రిక్ వివరాలు భద్రంగా ఉండటం వల్ల పాస్‌పోర్ట్ దుర్వినియోగం అయ్యే అవకాశం చాలా తక్కువ.

మోసాలకు అడ్డుకట్ట: ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీ కారణంగా ఈ-పాస్‌పోర్టులను నకిలీ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం దాదాపు అసాధ్యం.

వేగవంతమైన సేవలు: విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు పాస్‌పోర్ట్‌ను పూర్తిగా తెరవకుండానే, కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో చిప్‌లోని వివరాలను వేగంగా స్కాన్ చేసి ప్రక్రియను పూర్తి చేస్తారు.

అంతర్జాతీయ గుర్తింపు: ఈ పాస్‌పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు చేయవచ్చు.

Akhand Bhoomi News

error: Content is protected !!