అనుభవాల పాఠం వృద్ధాప్యం
అబ్రబోయిన శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ (ఎం ఎస్ డబ్ల్యూ );
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 04 (అఖండ భూమి న్యూస్);
మనిషి జన్మ చాలా చిత్రమైనది. శిశువు జన్మించినపుడు అందరికీ ఆనందాలు వెదజల్లుతాడు. అదేవిధంగా చనిపోయి నప్పుడు అందరికీ కన్నీళ్ళు మిగిల్చి అనంత వాయువుల్లో కలిసిపోతాడు.శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలిపోవడమో, భూగర్భంలో కలిసి పోవడమో జరుగుతుంది. ఇది సృష్టిధర్మం. మనందరికీ తెలిసిన నగ్నసత్యం. ఉపనిషత్తులలో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు. బాల్యాన్ని ఉదయంతోను, మధ్యాహ్నం యవ్వనంతోను, సాయం కాలాన్ని వృద్ధాప్యంతోను, రాత్రి నిమరణంతోను వర్ణించారు.
బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో, అంతే బాధాకరం గా వృద్ధాప్యం నడుస్తుంది.
ఈ వృద్ధాప్యం అనేది మనిషి జన్మలో అతి ముఖ్యమైంది.
ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు, మరికొందరికి చీకటి వెలుగులు పంచి పెడుతుంది. 60సంవత్సరాల వయస్సు వరకు మనిషి జన్మ ఓ విధంగా నడిస్తే ఆపై వచ్చే దశనే వృద్ధాప్యం అంటారు. హాయి హాయి గా గడిచే జీవితంలోఅనూహ్య మార్పులు చోటుచేసుకొంటూ వచ్చి చివరికి మనిషిని మ్రగ్గిన పండులా మార్చి రాలిపోయేలా చేస్తుంది. వృద్ధాప్యం.అన్ని కష్టాలు 60 నుండే ఆరంభం అవుతాయి. ఆరోగ్య, మానసిక, సాంఘిక సమస్యలు ప్రతిమనిషిలోనూ తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగావున్నా ఈ సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి. ఎంతో అందంగా కాపాడుకొంటూవచ్చిన మానవ దేహం రిపేరుకొచ్చేస్తుంది. శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్తువ అవుతూ వస్తుంది. కొందరికి ముందుగా పంటి సమస్యలు, కంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కొందరిలో 60 సం.లనుండి ఆరంభం అయితే, మరికొందరికి 65 సం.లో ప్రారంభమవుతాయి. కొందరు వేగంగా వెళ్లిపోతారు. ఇంకొందరు కాస్త నెమ్మదిగా నడుస్తూ వెళ్లిపోతారు. అందరూ చేరే గమ్యం ఒక్కటే! కర్మ సిద్ధాంతాలతో మిగిలినవారు సరిపుచ్చుకుంటారు. ఇది జీవనతరంగం. అన్నేళ్ళ ఆనందాలన్నీ ఆవిరైపోయి శేషజీవితం విషాదంతో ముగుస్తుంది. భగవంతుడు ఒక్కసారిగా మనిషికి వృద్ధాప్యంలో కష్టాల్ని ఆరంభిస్తాడు. ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై బాధిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. కానీ క్రమంగా ఆలోచించే శక్తి సన్న గిల్లుతుంది. ఎంత గింజుకున్నా కొన్ని గుర్తుకురావు. మనకు కావాల్సిన వ్యక్తుల్నే మనం గుర్తించలేము. ఒక్కోసారి ఆత్మీయుల పేర్లను కూడా మరచిపోతాం. మందు బిళ్ళలు వేసుకొన్నా అవి మనకు పూర్వశక్తిని తీసుకురాలేవు. కొందరికైతే శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది. నడుం నొప్పులు, కీళ్ళనొప్పులు , ఎన్నెన్నో.. బాధలు అపరిమితం. ఒక్కోసారి అసహనం, కోపం కూడా వృద్ధాప్యాన్ని వెక్కిరిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్థుల బాధలైతే మరీ వర్ణనాతీతం. ఈదశలో కొందరికి సరైన ఆదరణ కన్పించదు. వాళ్ళ జీవితం మరీ దుర్భరం. ఒంటరి బ్రతుకు. సాంఘికంగా, ఆర్థికం గా మానసికంగా అన్నీసమస్యలే. భార్యలు కోల్పోయిన ,భర్తల్ని కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విచారకరం.కొందరు వృద్ధాప్యం లో బాగా డిప్రెషన్‌కు గురవుతారు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అందరిపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. పిల్లల్ని తమ అదుపు ఆజ్ఞలో ఉంచాలనుకొంటారు. అన్ని విషయాల్లో తాము చెప్పిందే శాసనం కావాలనుకొంటారు. కొంతమంది వృద్ధాప్యంలో మంచాన బడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భరజీవితాన్ని గడుపుతుంటారు. అలాంటివారిని చూసి రెండు కన్నీటిబొట్లు విడవడం తప్ప ఏంచేయలేం. చాలామంది వృద్ధులు తమ ఇంటికే పరిమితమై జీవిస్తుంటారు. వీళ్లలో ఆత్మన్యూనతా భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ కలవాలనుకోరు. ముఖ్యంగా తమకన్నా చిన్న వయసున్న వారితో. కొందరిలో మతిమరుపు ఎక్కువకావడం చాలా అనర్థాలకు కారణమవుతాయి. రాను రాను చెవుడు కూడా తోడుకావడం మరింత బాధాకరం అన్పిస్తుంది. ఆ వయస్సులో కూడా కొందరిలో ఏదో చేయాలన్న తపన. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.
కొంతమంది పిల్లలు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూస్తారు. మానవ సంబంధాలకన్నా ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత సంతరించుకొన్న ఈ జన జీవనంలో వృద్ధుల్ని తమకు భారంగా కూడా భావిస్తారు. ఇలాంటి వారికి సమాజంలోని కొందరైనా చేయూత నివ్వాలి.వృద్ధుల్ని పిల్లల్లా చూసుకోవాలి. ఆఖరి దశలో వీరిలో పిల్లల ప్రవర్తనే ఎక్కువ చోటు చేసుకుంటుంది. తమని కూడా చిన్నపిల్లల్లా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి. క్రమం తప్పక చికిత్సలు అందజేయాలి.
వీలైనన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లు, వృద్ధాశ్రమాలు ప్రభుత్వమే నెలకొల్పాలి. ముఖ్యంగా వీరికి అన్ని మందులు ఉచితంగా అందజేయాలి. విధిగా ప్రతి ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి సబ్సిడీపై చికిత్స జరిపించాలి. మానసికంగా కూడా వీళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ఇప్పటికే ఆ దిశగా కొన్ని సదుపాయాలను కల్పించాయి. టాక్స్ బెనిఫిట్స్, డిపాజిట్లకు అదనపు వడ్డీ తోపాటు విమాన, రైలు, బస్సు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలిస్తున్నాయి. బ్యాంకుల్లో కొత్తగా 65 సం.లు దాటిన వృద్ధులకు ప్రత్యేక సహాయం ఏర్పాట్లు చేశారు.వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నంతకాలం హాయిగా, ఆనందంగా ఎలాంటి దురాలోచనలు చేయకుండా బ్రతకడం నేర్చుకోవాలి.
జననం తథ్యమని.. మరణం తప్పదని గుర్తెరగాలి. తొలి జీవితాన్ని కడవరకూ కోరు కోవడం అత్యాశే. అందరికీ ఆదర్శంగా బ్రతకాలి. కనీసం ఇపుడైనా వయస్సులో అహం కారంతో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తు తెచ్చుకుని వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి కూడా చేస్తే మంచిది.
దైవచింతన కూడా కొంతవరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుంది. ఇంట్లోనే హాయిగా ఆత్మ విశ్వాసంతో, ఆనందంతో జీవించండి.. ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే! అనుభ వాల పాఠం వృద్ధాప్యం.
.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…
ముదిరాజ్ జాతి హక్కుల సాధనకై నిరంతర ఉద్యమం..!


