ప్లాస్టిక్ రహిత గ్రామాలే ఆరోగ్యకర సమాజానికి పునాది…
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 06 (అఖండ భూమి న్యూస్);
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
గురువారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, ప్రతి ఇంటికి జ్యూట్ సంచులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని దెబ్బతీయడంతో పాటు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయని తెలిపారు. పశువులు ప్లాస్టిక్‌ను తినడం వల్ల వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని, ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల వెలువడే విషపూరిత వాయువులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలువలు మూసుకుపోయి పారిశుధ్య సమస్యలు, దోమల వ్యాప్తి, వివిధ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందన్నారు.
జ్యూట్ సంచుల వినియోగం పర్యావరణ హితమని, ఇవి పునర్వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని తెలిపారు. ప్రతి కుటుంబం మార్కెట్‌కు వెళ్లేటప్పుడు జ్యూట్ సంచులను తప్పనిసరిగా వినియోగించి, ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ సంచులకు పూర్తిగా స్వస్తి పలకాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తమ ఇల్లు, గ్రామం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన గ్రామాల్లో విజయవంతంగా అమలు చేసి, అనంతరం జిల్లాలోని ఇతర గ్రామాలకు విస్తరించేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థలు కలెక్టర్ NY గిరి. ఎంపీడీవో. తహసిల్దార్. సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్…
జర్నలిస్టు మృతి పట్ల సంతాపం తెలిపిన దోమకొండ జర్నలిస్టులు..
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


