ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు06 (అఖండ భూమి న్యూస్);

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిరంతర పోరాటం చేసిన గొప్ప మేధావి, విద్యావేత్త, ఉద్యమకారుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

సమాజ అభివృద్ధి, విద్యా వికాసం, సామాజిక న్యాయం, ప్రాంతీయ సమానత్వం కోసం ఆచార్య జయశంకర్ చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల ఆకాంక్షల సాధనకే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వమని కొనియాడారు.

ఆచార్య జయశంకర్ చూపిన మార్గంలో నడుస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, జిల్లా రెవెన్యూ అధికారి పాండు, బిసి వెల్ఫేర్ నరసయ్య. టీఎన్జీవో అధ్యక్షుడు నారాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఫిజియో అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి. సెక్రటరీ సాయి రెడ్డి. జిల్లా అధికారులు, వివిధ శాఖల అధిపతులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!