రాజకీయ కక్షతోనే ఓర్వలేకనే అక్రమ అరెస్టు చేయించారు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్)
తన రాజకీయ ఎదుగుదల ఓర్వలేకనే తనపై కక్షపూరితంగానే తప్పుడు కేసులో ఇరికించి అక్రమ అరెస్టు చేయించారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం బెయిల్ పై విడుదలైన తరువాత శుక్రవారం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అరెస్టుకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. గత నెల 30 న తిరుపతి వెళ్లి ఈ నెల 2 న కామారెడ్డికి తిరిగి వచ్చానని అన్నారు. ఈ నెల 3 న ఒక వెంచర్లో లభించిన జిలెటన్ స్టిక్స్, డిటోనేటర్ల కేసులో పట్టణ సీఐ నరహరి తనకు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఫోన్ చేయగా, తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో తాను వెళ్లే సమయానికే ఏ ఎస్ పి చైతన్య రెడ్డి ఉన్నారని అన్నారు. ఈ కేసు విషయంపై పలు ప్రశ్నలు అడిగారని అందుకు బదులుగా తనకు ఆ వెంచర్ లో ఒక గుంట భూమి కూడా లేదని అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం రూరల్ సీఐ రామన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీతో ఎస్పీ మాట్లాడతారని తనను ఒక ప్రైవేటు వాహనంలో ఎక్కించుకొని ఎస్పీ ఆఫీసు వైపు కాకుండా నేరుగా హైవే పైకి తీసుకెళ్లారని చెప్పారు.రాత్రి 12 గంటలకు తనను నేరుగా బాన్సువాడ ప్రాథమిక పాఠశాలలో కూర్చోబెట్టి మళ్లీ అవే ప్రశ్నలు వేసారని తెలిపారు. సుమారు 2 గంటల సమయంలో గవర్నమెంట్ వైద్యుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయం 3 గంటలకు బిచ్కుంద జడ్జి వద్ద హాజరుపరిచారని 6 గంటలకు నిజామాబాద్ సబ్ జైలుకు తరలించారని తెలిపారు.
ఓ మాజీ కౌన్సిలర్ తనపై సోషల్ మీడియాలో తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తనకు టిపిసిసి జనరల్ సెక్రెటరీ పదవి వచ్చినప్పటి నుండి రాజకీయంగా జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువు ప్రతిష్ట లకు భంగం కల్పిస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వారికి సమయమే తగిన గుణపాఠం చెబుతుందని అన్నారు.
చట్టం, న్యాయం పై నమ్మకం ఉంది
తనకు చట్టం, న్యాయం పై నమ్మకం ఉందనీ, ఈ విషయాన్ని ఐజి కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమ అక్రమ అరెస్టు అంశంపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని వివరించారు.
నాపై కుట్ర చేసిన వివరాలను అధిష్టానానికి ఫిర్యాదు చేశా..
రాజకీయంగా ఎదుగుతానని ఉద్దేశంతోనే నాపై ఒక నాయకుడి తోపాటు మరి కొంతమంది ప్రధాన పాత్ర ఉందని ఆయన అన్నారు. నాపై కుట్ర చేసిన వారిపై రాష్ట్ర అధిష్టానానికి పూర్తిస్థాయి సమాచారం అందించినట్లు తెలిపారు.