మాదకద్రవ్యాల దుర్వినియోగం నిర్మూలనే లక్ష్యం
-డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుదాం
-మాదక ద్రవ్యాల దుర్వినియోగం నిర్మూలనే లక్ష్యంగా “నశా ముక్త్ భారత్ అభియాన్”
-మత్తు పదార్థాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నశా ముక్త్ యాంటీ సోల్జర్ ప్రతిజ్ఞ.
-జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కామారెడ్డి టౌన్‌లో మాదకద్రవ్యాల వ్యతిరేక సామూహిక ప్రతిజ్ఞ.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 13 (అఖండ భూమి న్యూస్) నషా ముక్త్ భారత్ అభియాన్–2025’ లో భాగంగా కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర్, హాజరై, అధికారులు మరియు సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…..కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఏ) అమలు చేస్తోందని అన్నారు. ఈ అవగాహన ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సామూహిక ప్రతిజ్ఞను నిర్వహించడం జరిగింది అని అన్నారు.
జిల్లా పరిధిలో మాదకద్రవ్యాల సరఫరా, దుర్వినియోగంపై పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయి నిఘా ఉంచుతోందని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరా, సాగు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, అవసరమైతే పిడి ఏ సి టి అమలు చేస్తామని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల రహిత సమాజం నిర్మాణం కోసం అందరం కలసి పనిచేయాలని పిలుపునిస్తూ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్‌పి బి. చైతన్య రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి. శ్రీధర్, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.