భారీవర్ష సూచనలు నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య.
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 13 )
బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, చంద్రశేఖర్ మాధురి , నారాయణ్ ఖేడ్ సబ్ కలెక్టర్, ఉమా హారతి , జిల్లా అధికారులతో కలిసి భారీ వర్షాల వల్ల తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశం నిర్వహించి ,వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య దిశా నిర్దేశం చేశారు.
పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలన్నారు. జిల్లాలో ఒకేసారి వర్షం కురిసే అవకాశం లేదని , అయితే అధికారులు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ,సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వాగులు , చెరువులు వద్దకు ప్రజలు వెళ్లకుండా అధికారులు అందుబాటులో ఉండి అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు చేపల వేటకి వెళ్లరాదని ,రాత్రి వర్షం కురిస్తే సహాయక చర్యలు చేపట్టెందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు . రెవిన్యూ,పోలీస్, అధికారులు వాగుల వద్ద ఉంది ఎప్పటికప్పుడు నీటి ఉధృతిని పరిశీలించాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో ఇండ్లలోకి వరద నీరు వచ్చే అవకాశంవున్న ప్రాంతాలనుగుర్తించాలని అన్నారు .వర్షాలకు కూలిపోయే అవకాశం వున్న పాత ఇండ్లు ముందుగానే గుర్తించాలని వారికి ముందుగానే పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే బృందాలను సిద్ధంగా ఉంచాలని , విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ,విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తీగల సమీపంలో ప్రజలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు .వర్షాలకు దెబ్బతిన్న రహదారులనుండి వెంటనే ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయాలి. మరమ్మత్తులు తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు .
పఠాన్ చెరువు నియోజకవర్గం పరిధి, హెచ్ఎండిఏ పరిధిలోని కాలనీలలో పర్యటించి లోతట్టు ప్రాంతాలను గుర్తించి సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించారు . జాతీయ రహదారులు, ORR, ఇంటర్నల్ రోడ్లలో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలన్నారు . గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకుని జిల్లా పంచాయతీ అధికారి వరకు, ఆశాలు, ఏఎన్ఎంల నుండి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వరకు ఇలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ కార్యస్థానాల్లో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి దృష్ట్యా సెలవులను కూడా రద్దు చేయడం జరిగిందని గుర్తు చేశారు. రానున్న 48 గంటలలో భారీ వర్షాలు కారణంగా ప్రజలు ఇంటి పరిసరాలలో పరిశుభ్రత ఉండే విధంగా,కాచి వడ పోసిన నీరు తాగాలని టామ్ టామ్ ద్వారా తెలియచేయాలని అన్నారు.
సింగూరు జలాశయం గేట్లు తెరువనున్న నేపథ్యంలో దిగువన ఉన్న గ్రామాలను అధికారులు అప్రమత్తం చేయాలని ఆదేశించారు . వరద నీటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలనీ అధికారులను ఆదేశించారు . రాత్రి వేళల్లో ప్రత్యేక కాపలా సిబ్బందిని నియమించి పహారా ఏర్పాటు చేయాలన్నారు . విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్ బీ, పంచాయితీరాజ్, ఇరిగేషన్, వైద్యారోగ్యం, పురపాలక శాఖ , తదితర శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలో భారీ వర్షాల వల్ల ఎలాంటి ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, నేడు గురువారం (ఆగస్టు 14) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఐఈఓ గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు
ఈ వీడియో సమీక్ష సమావేశం లో పంచాయతీరాజ్,రెవెన్యూ ,ఇరిగేషన్ ,విధ్యుత్ శాఖ , ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు .