ప్రజలు భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 14 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల ప్రభావం ఉన్నందున అప్రమత్తంగా ఉండి లో లెవెల్ కాజ్వేలు బ్రిడ్జిల వద్ద నీరు పైనుండి ప్రవహించే సమయంలో ప్రజలు వాహనాలు ఆయా కాజ్వేలు బ్రిడ్జిలపై నుండి ప్రయాణం చేయకుండా కట్టు దిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలోని జంగమ్మర్రి గ్రామం సమీపంలో పాల్వంచమర్రి – భిక్కనూర్ రహదారిపై ఉన్న లో లెవల్ కాజ్‌వేను భారీ వర్షాల కారణంగా పెరిగిన నీటి మట్టం దృష్ట్యా జిల్లా కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నీటి ప్రవాహాన్ని పరిశీలించి పోలీసులు, ఆర్‌అండ్‌బీ, సాగునీటి శాఖ అధికారులు, ఎంపీడీవో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. “ఈ లో లెవల్ కాజ్‌వేపై నీరు ముంచెత్తే పరిస్థితి ఏర్పడితే, వాహన రాకపోకలను తక్షణమే మళ్లించాల్సి ఉంటుంది” అని కలెక్టర్ సూచించారు. ప్రజల భద్రత కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తిన తన దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. రానున్న మూడు రోజులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ మోహన్, ఎంపీడీవో, ఎస్సై, ఆర్ అండ్ బి ఇంజనీర్లు తదితరులు ఉన్నారు.


