రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16)

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు పాటించాల్సిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ దేవ్ కుమార్ రైతులకు పలు సూచనలు చేయడం జరిగింది

ఈ సందర్భంగా మాట్లాడుతూ

వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంట పొలాల నుండి నీరు నిలిచి ఉన్నట్లయితే, త్వరగా బయటకు పంపేందుకు మురుగునీటి కాలువలను ఏర్పాటు చేయాలి.

ఎరువుల వాడకం, పైపాటుగా వేసే ఎరువులు, పురుగు మందుల పిచికారిని తాత్కాలికంగా నిలిపివేయాలి.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున, విద్యుత్ స్తంభాలు మరియు తీగలకు దూరంగా ఉండాలి. మోటార్ స్టార్టర్లను జాగ్రత్తగా ఆన్ చేయాలి.

చెట్ల కింద నిలబడటం లేదా పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచడం మానుకోవాలి.

వర్షాల వల్ల పొలాల గట్ల వెంబడి విషసర్పాలు, విష కీటకాలు ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా నడవాలి.

పంటల వారీగా సూచనలు:

వరి: నీటిలో మునిగిన పొలాల నుండి నీటిని త్వరగా బయటకు పంపాలి. నాట్లు వేయని రైతులు వర్షాలు తగ్గిన తర్వాత నాట్లు వేయడానికి సిద్ధం కావాలి. సమయం తక్కువగా ఉన్నట్లయితే, వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేయాలి. కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి. పంట త్వరగా కోలుకోవడానికి, లీటరు నీటికి 5 గ్రా. చొప్పున 19.19.19 ద్రావణాన్ని లేదా 2 మి.లీ. చొప్పున నానో యూరియా లేదా నానో డీఏపీని పిచికారి చేయాలి.

పత్తి: అధిక వర్షాల కారణంగా వడలు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు, లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి మొక్కల మొదళ్లలో తడిచే విధంగా పిచికారి చేయాలి. దీనిని వారంలో రెండుసార్లు చేయాలి. పంట త్వరగా కోలుకోవడానికి లీటరు నీటికి 5-10 గ్రా. మల్టీ-కే లేదా 10 గ్రా. యూరియా లేదా 2 మి.లీ. నానో యూరియాను పిచికారి చేయాలి.

* మొక్కజొన్న: పొలంలో నీరు నిలిచి ఉన్నట్లయితే వెంటనే బయటకు పంపే చర్యలు తీసుకోవాలి. భాస్వరం లోపం నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. నానో డీఏపీ లేదా 5 గ్రా. 19.19.19 పోషకాన్ని పిచికారి చేయాలి.

కూరగాయలు: అధిక వర్షాల వల్ల నారు కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.

ఆరుతడి పంటలు: వర్షాలు తగ్గిన తర్వాత పొలంలో అంతర కృషి చేయడం వల్ల కలుపు మొక్కలను తొలగించడంతో పాటుగా పొలంలో అధిక తేమను తగ్గించుకోవచ్చు.

ఈ సూచనలను పాటించి రైతులు తమ పంటలను కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ దేవ్ కుమార్ రైతులను కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!