యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలి

యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలి

టాస్క్ ఫోర్స్ బృందాలతో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అకండ భూమి న్యూస్ ఆగస్టు 18 )

యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలి

టాస్క్ ఫోర్స్ బృందాలతో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి

వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు

కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీ.సీలో మంత్రి తుమ్మల, సీ.ఎస్ వెల్లడి

సజావుగా పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని దిశానిర్దేశం

వ్యవసాయ అవసరాల కోసం కేటాయిస్తున్న యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు స్పష్టం చేశారు. సోమవారం వారు రాష్ట్ర సచివాలయం నుండి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, సంచాలకులు గోపి తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆయా జిల్లాలలో అందుబాటులో ఉన్న యూరియా ఎరువుల నిల్వలు, పంపిణీ తీరుతెన్నులను సమీక్షిస్తూ, కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ, ఇతర శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించుకుని, ఎక్కడ కూడా యూరియా ఎరువులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని మంత్రి తుమ్మల సూచించారు. ముందస్తుగానే రుతుపవనాలు ప్రవేశించి సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం వల్ల పత్తి, వరి, మొక్కజొన్న తదితర అన్ని రకాల పంటలను రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏకకాలంలో సాగు చేస్తున్నారని అన్నారు. దీంతో గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సీజన్ లో ఇదే సమయానికి ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలను ఎక్కువ మొత్తంలో పంపిణీ చేయడం జరిగిందన్నారు. అయితే, అనేక కారణాల వల్ల కేంద్రం నుండి రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు రాష్ట్రానికి రావడం లేదని, కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకనూ రావాల్సి ఉందని మంత్రి వివరించారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న ఎరువులను, ప్రత్యేకించి యూరియా నిల్వలను సజావుగా పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు హితవు పలికారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ప్రతి జిల్లాలోని ఆయా మండలాల వారీగా సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను నిరంతరం పరిశీలన చేస్తూ, అవసరం ఉన్న ప్రాంతాలకు సర్దుబాటు చేయాలని సూచించారు. ఎక్కడ కూడా యూరియా స్టాక్ లేదు అనే అభద్రతా భావం రైతుల్లో నెలకొనకుండా, వారి అవసరాలకు సరిపడా యూరియాను అందించేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. ఎరువుల స్టాక్ కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.

యూరియా అక్రమ రవాణా జరగకుండా, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించకుండా కోళ్ల ఫారాలు, పేపర్ మిల్లులు, ఆయా పరిశ్రమలలో తనిఖీలు జరపాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ లను నెలకొల్పి, యూరియా ఎరువులు దారి మళ్ళకుండా చూడాలన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో పోలీసు శాఖ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. అదే సమయంలో యూరియాను అవసరానికి మించి వినియోగించకుండా, ఒకేసారి ఏకమొత్తంలో యూరియా కొనుగోలు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.

యూరియా ఎరువులు జిల్లా సరిహద్దులు దాటకూడదు : జిల్లా కలెక్టర్ పి .ప్రావీణ్య .

జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచడం జరిగిందని కలెక్టర్ పి ప్రావీణ్య స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు లు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం జిల్లా ఎస్ పి పారితోష్ పంకజ్ తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని సహకార సంఘాలలో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా అనునిత్యం పర్యవేక్షణ జరపాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఒక్క ఎరువు బస్తా కూడా అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటి వెళ్ళకుండా గట్టి నిఘా కొనసాగించాలని అన్నారు. సొసైటీలలో ఎరువుల స్టాక్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ప్రైవేట్ విక్రయ కేంద్రాలను కూడా మండల వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూడాలన్నారు. ఎక్కడైనా ఎరువుల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడడం, బ్లాక్ మార్కెట్ కు తరలించడం, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు విక్రయాలు జరపడం, ఎరువులను పక్కదారి పట్టించడం వంటివి గుర్తిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ తో పాటు వచ్చే రబీ సీజన్ లో కూడా ఎరువుల కొరత నెలకొనకుండా ఇప్పటినుండే ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ ,జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్ , సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!