రిజర్వేషన్లు ఖరారు.. తెలంగాణలో మొదలైన ఎన్నికల సందడి..!

రిజర్వేషన్లు ఖరారు.. తెలంగాణలో మొదలైన ఎన్నికల సందడి..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 25 (అఖండ భూమి న్యూస్) తెలంగాణలో మళ్లీ ఎన్నికల కాసేపు మొదలైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభ దశలోకి అడుగుపెట్టింది. పంచాయతీ, మండల, జెడ్పీ స్థాయిల్లో ప్రజా ప్రతినిధుల ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి, ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. అన్ని అనుకూలిస్తే ఈనెల 29న అధికారికంగా షెడ్యూల్ విడుదల కానుంది.

బీసీలకు 42%, మహిళలకు 50% రిజర్వేషన్లు

వార్డు సభ్యులు నుంచి జెడ్పీ స్థానాల వరకు జిల్లాల కలెక్టర్లు రూపొందించిన రిజర్వేషన్ నివేదికలు బుధవారం సాయంత్రానికి ప్రభుత్వానికి అందించారు. వాటి ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించనుంది. అదేవిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేయనున్నారు.

ప్రధాన పార్టీల సన్నాహకాలు

రాబోయే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్ లు తమ బలాన్ని చాటుకునేందుకు ముమ్మరంగా సన్నాహాలు మొదలుపెట్టాయి.

కాంగ్రెస్ పార్టీ – రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ప్రజా నిధులను అభివృద్ధి కార్యక్రమాలపై వినియోగించి, అదే ఓట్లుగా మారుతుందని భావిస్తోంది.

బీజేపీ – ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్థానిక ఎన్నికల్లో కూడా పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బీఆర్‌ఎస్ – గతంలో గ్రామీణ స్థాయిలో గట్టి పట్టున్న ఈ పార్టీ ఇప్పుడు ప్రజల్లో తిరిగి బలంగా నిలబడేందుకు కసరత్తులు చేస్తోంది.

అభ్యర్థుల ఉత్సాహం

గ్రామ, మండల స్థాయిల్లో స్థానిక నేతలు ఇప్పటికే తమ ప్రభావం చూపించేందుకు జాగ్రత్తలు మొదలుపెట్టారు. రిజర్వేషన్ లిస్టు బయటకొచ్చాక పోటీ వాతావరణం మరింత రగిలే అవకాశం ఉంది. యువ నాయకులు, మహిళా అభ్యర్థులు కూడా బలంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రభావం ఈ ఎన్నికలతో గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ రాజకీయ ఉత్సాహం కనిపించనుంది. స్థానిక సంస్థల్లో ఎవరు గెలుస్తారో అన్నది రాబోయే అసెంబ్లీ ఎన్నికల దిశలోనూ సంకేతాలు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!