వైన్స్ షాపులకు 60 వేల దరఖాస్తులు.. ఒక్కో షాపునకు సగటున 23 దరఖాస్తులు..  23న లక్కీ డిప్..!

వైన్స్ షాపులకు 60 వేల దరఖాస్తులు.. ఒక్కో షాపునకు సగటున 23 దరఖాస్తులు..  23న లక్కీ డిప్..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 20 (అఖండ భూమి న్యూస్);

_ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల ఫీజు_

_అప్లికేషన్ ఫీజుగా సర్కారుకు 18 వందల కోట్లు_

_2,620 మద్యం షాపులకు టెండర్లు_

_హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు శనివారం_ _(అక్టోబర్ 18) సాయంత్రం 4 గంటల వరకు 60 వేల దరఖాస్తులు వచ్చాయి._

_లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించేందుకు ఆబ్కారీ శాఖ సెప్టెంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు మందకొడిగా దరఖాస్తుల పర్వం కొనసాగింది. శుక్రవారం (అక్టోబర్ 17) ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు వచ్చాయి._

_శనివారం మరో పది వేల మంది వైన్స్ షాపుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున నాన్ రిఫండెబుల్ ఫీజును వసూలు చేసింది. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 18 వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మద్యం టెండర్లకు లక్షా 32 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా 2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి రూ. 3 వేల కోట్ల అప్లికేషన్ ఫీజు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది._

_2023లో అసెంబ్లీ, 2024లో పార్లమెంటు ఎన్నికలు ఉండటంతో భారీగా దరఖాస్తులు వచ్చాయనే వాదన ఉంది. దీనికి తోడు అప్లికేషన్ ఫీజు కూడా రూ. రెండు లక్షలుగా ఉండటం కూడా కారణమంటున్నారు. ఈ సారి దానిని రూ.3 లక్షలకు పెంచారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ దర ఖాస్తుల సంఖ్య బాగా పడిపోవడం గమనార్హం._

_అక్టోబర్16 వరకు 20 రోజుల్లో సుమారు 25 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. శుక్రవారం రాత్రివరకు మరో 25 వేల దరఖాస్తులు రావడంతో మొత్తం దరఖాస్తులు 50వేల వరకు చేరాయి._

_శనివారం మరో పది వేల దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని ఒక మద్యం దుకాణానికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్టు తెలిసింది. రిజర్వుడ్ దుకాణాలకూ గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గినట్టు సమాచారం. వ్యాపారులు సిండికేట్లుగా మారి కొన్నే దరఖాస్తులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి._

Akhand Bhoomi News

error: Content is protected !!