నాతవరం మండలంలో గ్యాస్ వాసనతో భయాందోళనలో ప్రజలు!
నాతవరం, అక్టోబర్ 19 (అఖండ భూమి న్యూస్):
అనకాపల్లి జిల్లాలోని నాతవరం మండల పరిధిలో ఇండ్లలో గ్యాస్ లీకేజీ వాసనతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ గ్యాస్ సేవలు పొందుతున్న లబ్ధిదారుల ఇళ్ల వద్ద గ్యాస్ వాసన అధికంగా వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ స్టవ్‌లు ఆఫ్ చేసినా కూడా వాసన కొనసాగుతుండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఇళ్లలో ఉంచిన సిలిండర్ల వద్దే గ్యాస్ లీకైన వాసన వస్తోందని, ఏమవుతుందో అనే భయం వెంటాడుతుందని వినియోగదారులు చెబుతున్నారు. దీని వలన ఎటువంటి ప్రమాదం సంభవించవచ్చనే భయంతో ప్రజలు రాత్రివేళల్లో కూడా నిద్ర లేకుండా ఉన్నారు. గ్రామ ప్రజలు ఈ సమస్యను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మండలంలోని ఇప్పటికే గ్యాస్ లీకై అనేక ఇల్లు కాలి దగ్ధమవడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ సిలిండర్ల నాణ్యత, కాలం, వాల్వుల స్థితి వంటి అంశాలను అధికారులు తక్షణమే పరిశీలించాలని, ప్రజల భద్రతను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా జిల్లా సివిల్ సప్లైస్, ఫైర్ సర్వీస్ మరియు గ్యాస్ కంపెనీ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.



