ధరణి కుంభకోణంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు….
ఆలేరు జనవరి 12. (అఖండభూమి న్యూస్):
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన ధరణి కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్న పలువురు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఇటీవల జనగామ జిల్లాలో 8 లక్షల 67 వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా సదర్ స్లాట్ నిర్వాహకులు 13307 రూపాయలు మాత్రమే చెల్లించి, ఎనిమిది లక్షల 55 877 రూపాయలు దారి మళ్లించారు. దీంతో అప్రమత్తమైన జనగామ తహసిల్దార్ పోలీసులకు సమాచారం అందించగా, రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ధరణి ద్వారా ప్రభుత్వానికి 4800 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా, 48 కోట్ల రూపాయలు దారి మళ్లినట్లు నిర్ధారించి, పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఈ విషయం ఇటీవల అన్ని సామాజిక మాధ్యమాలు, దినపత్రికలలో ప్రచారం కావడంతో స్పందించిన అధికారులు అన్ని కోణాలలో దర్యాప్తు జరిపి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని నెట్ సెంటర్ నిర్వాహకులు, యాదగిరిగుట్ట మండలంలోని గౌరయ్య పల్లి గ్రామానికి చెందిన పసునూరి బసవరాజు, రాజపేట మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన జల్ల పాండు లను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. బేగంపేట గ్రామానికి చెందిన కనకయ్యను సైతం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. సదర్ నిర్వాహకులు ఇటీవల యాదగిరిగుట్ట పట్టణంలో ఐదు అంతస్తుల భవనం, హైదరాబాద్, విజయవాడ పట్టణాలలో భారీ ఆస్తులు ఉన్నట్లు నలుగురు ఆరోపిస్తున్నారు. బసవరాజు పితృమూర్తి అశోక్ గ్రామంలో నాటు వైద్యనిగా సాధారణ జీవితం కొనసాగిస్తున్నారు. పాండు సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం చేయడం పలువురిని విస్మయానికి గురిచేసింది. భూ భారతిలోని లోపాలను ఆసరాగా చేసుకుని 48 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన అక్రమార్కులు.
జనగామలో తీగ లాగితే రాష్ట్రమంతా కదిలిన డొంక.
భూ భారతి పోర్టల్ లోని లోపాలను తమకు అనుకూలంగా మలచుకొని కోట్లల్లో దోపిడి. రంగారెడ్డి, భువనగిరి, జనగామ జిల్లాలో అత్యధికంగా సొమ్ము దారి మళ్లింపు జరిగినట్లు సమాచారం….



