రంపచోడవరం కేంద్రంగా గిరిజన ఐక్యతకు పిలుపు – ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఘన అభినందన సభ

రంపచోడవరం కేంద్రంగా గిరిజన ఐక్యతకు పిలుపు – ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఘన అభినందన సభ

రంపచోడవరం, ఫిబ్రవరి 08;(అఖండ భూమి న్యూస్)పోలవరం జిల్లా, రంపచోడవరం మండల కేంద్రంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డికి ఘనంగా అభినందన సభ నిర్వహించారు. గిరిజన సంఘాల ఆహ్వానంపై చైర్మన్ ఈ సభకు హాజరై గిరిజన ప్రజలను ఉద్దేశించి హృదయపూర్వకంగా మాట్లాడారు.

సభా వేదికపై చైర్మన్ మాట్లాడుతూ, గిరిజనులు అందరూ ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. సంఘాల పేర్లతో, రాజకీయ పార్టీల పేర్లతో విడిపోయి బలహీనపడకూడదని, ఐక్యతే గిరిజన జాతి బలమని స్పష్టంగా చెప్పారు. జాతి అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ గిరిజనుల వెంట ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని భరోసా ఇచ్చారు.

గిరిజనులకు ఎలాంటి సమస్య ఎదురైనా తానే ముందుండి పోరాడి పరిష్కారం సాధిస్తానని చైర్మన్ ధీమాగా చెప్పారు. గిరిజన జాతి హక్కులు, సంక్షేమం కోసం ఈ పదవిని ఒక బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గిరిజన నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్‌గా గిరిజన జాతికి ఒక పెద్ద అధికార ప్రతినిధి పదవి రావడం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఇది గిరిజనుల పోరాటాలకు, ఆశయాలకు దక్కిన గౌరవమని అభిప్రాయపడ్డారు.

అభినందన సభలో చైర్మన్ మరోసారి మాట్లాడుతూ,

“పదవి అంటే అధికారం కాదు. అది ఒక బాధ్యత. ఈ బాధ్యతతో నా కర్తవ్యాలు మరింత పెరిగాయి. గిరిజనుల న్యాయం కోసం చివరి వరకు నిలబడతాను” అని స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు సభకు హాజరైన గిరిజనుల్లో విశేష ఉత్సాహం నింపాయి.

ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, జగ్గారావు, పాకీర్ దొర, సమంతకృష్ణ, వెంకటరెడ్డి తదితర గిరిజన నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని సభను విజయవంతం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!