ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడును
…
*ఆయిల్ ఫాం ప్లాంటేషన్ పై రైతులకు అవగాహన కల్పించాలి:.
*ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలి..
రైతులు ఈ పంటల సాగు తో లాభాలు పొంది ఆనందంగా జీవించాలి..
*పచ్చని పొలాలతో కళకళలాడాలి..
*వ్యవసాయ శాఖ మంత్రి
*తుమ్మల నాగేశ్వరరావు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 20 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం పాల్వంచ శివారులో వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫాం మాస్ ప్లాంటేషన్ మొక్కలను హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా , శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ లతో కలసి మొక్కలు నాటారు.
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అనంతరం ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రైతు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగులో అంతర పంటలను కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ మిషన్ వంటనూనెలు – ఆయిల్ పామ్ (ఎన్ ఎం ఈ ఓ ఓపి ) పథకం కింద ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్నదని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న పామాయిల్ మిల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గెలలను కొనుగోలు చేసి, 14 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు తెలిపారు.
ప్రపంచంలో అత్యధికంగా వంటనూనెల దిగుబడిని ఇచ్చే పంటలలో ఆయిల్ పామ్ ప్రధానమైనదని సంవత్సరానికి హెక్టారుకు 4 నుండి 6 మెట్రిక్ టన్నుల (MT) నూనె దిగుబడిని ఇచ్చే ఈ పంట, ప్రపంచ వంటనూనెల ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జాతీయ మిషన్ వంటనూనెలు – ఆయిల్ పామ్ (ఎన్ఎంఈఓ-ఓపి) పథకాన్ని పురస్కరించుకుని, కేంద్ర వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సమన్వయంతో ఉద్యానశాఖ ద్వారా కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోందన్నారు. ఈ క్రమంలో బహుళజాతి సంస్థ హిందుస్థాన్ అన్లివర్ లిమిటెడ్ (హెచ్ యు ఎల్)కు జిల్లాలో ఆయిల్ పామ్ తోటల అభివృద్ధి బాధ్యతలు అప్పగించడం జరిగిందని, ఆయిల్ పామ్ చట్టం – 1993 ద్వారా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోబడినవి. జిల్లాకు కేటాయించిన కంపెనీ నర్సరీలను అభివృద్ధి చేసి రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయడంతో పాటు సాంకేతిక సలహాలు అందిస్తుంది. అదేవిధంగా జిల్లాలో పామాయిల్ మిల్‌ను ఏర్పాటు చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతుల వద్ద నుండి ఆయిల్ పామ్ గెలలను కొనుగోలు చేసి, 14 రోజులలోపే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయబడుతుంది.
వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎన్.ఎం.ఇఓ-ఓపి పథకం క్రింద ప్రభుత్వం మొదటి నాలుగు సంవత్సరాల కాలానికి ఎకరాకు గరిష్టంగా రూ. 50,918 వరకు (పథకం నిబంధనల ప్రకారం) రాయితీ అందిస్తుంది. ఈ రాయితీ మొక్కలు, ఎరువులు, అంతరపంటసాగు , సాగు పరికరాల ఏర్పాటు కోసం అందించబడుతుంది.
మొక్కల కోసం రైతు తన వాటాగా ఒక్క మొక్కకు రూ. 20 చెల్లించవలసి ఉంటుంది. బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) పరికరాల ఏర్పాటు కోసం కూడా పథకం మార్గదర్శకాల ప్రకారం రైతు వాటా చెల్లించాలి.
హెచ్ యు ఎల్ సంస్థ ప్రత్యేక పథకం కింద, ఎన్ ఎం ఈ ఓ-ఓపి పథకానికి అదనంగా రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ. 5,000/- ఒకేసారి డ్రిప్ ఇరిగేషన్ మద్దతు అందించబడుతుంది. ఈ మొత్తం నేరుగా డ్రిప్ ఇరిగేషన్ సంస్థకు చెల్లించబడుతుందనీ
ఆయిల్ పామ్ సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలం. అయితే నీటి వసతి తప్పనిసరి. నీరు నిల్వ ఉండని, అధిక సేంద్రియ పదార్థం కలిగి నీరు సులభంగా జొరబడే నేలలు ఉత్తమం. ఉదజని సూచిక (పి హెచ్) 6.5 నుండి 7.5 మధ్య ఉండడం అనుకూలమని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి రైతులకు ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలను వివరించి, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకొని ఆదాయం పెంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని హిందుస్థాన్ అన్లివర్ లిమిటెడ్- ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భంగా అత్యధిక లాభాలు అందించే ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అనేక ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్‌కు కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. రైతులు ఆర్థికంగా బలపడేలా కంపెనీ పూర్తి సహకారం అందించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటగా మారుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ మిషన్ వంటనూనెలు – ఆయిల్ పామ్ (ఎన్ఎంఈఓ-ఓపి) పథకం ద్వారా అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాల్వంచ మండలంలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన నేలలు, నీటి వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని అన్నారు. జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న హిందుస్థాన్ అన్లివర్ లిమిటెడ్ రైతులకు నాణ్యమైన మొక్కలు, సాంకేతిక సలహాలు అందించడంతో పాటు గెలల కొనుగోలులో పారదర్శకత పాటించాలని సూచించారు.
ఆయిల్ ఫాం పై రైతులు మాట్లాడుతూ తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ మధుమోహన్, తాసిల్దార్, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ , సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


