తాటిమనుపాలెం పాఠశాల అభివృద్ధికి వసంతం ట్రస్ట్ చేయూత

అంతాడ సర్పంచ్ సుర్ల చంద్ర రావు
కొయ్యూరు అల్లూరి జిల్లా
మార్చి 19 అఖండ భూమి
విద్యాభివృద్ధికి వసంతం బాలల సంక్షేమ సంస్థ తోడ్పాటు అందించడం అభినందనీయమని కొయ్యూరు మండల విద్యాశాఖ అధికారి సింహాచలం కొనియాడారు. గురువారం మండలంలో తాటి మాని పాలెం ఎంపీ పి పాఠశాలకు వసంతం ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రూ,60వేలు విలువచేసే 10 బెంచీలు రెండు బ్లాక్ బోర్డులు, భోజనం ప్లేట్లు గ్లాసులు తదితర సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో అంతాడ సర్పంచ్ సుర్ల చంద్రరావు మాట్లాడుతూ వసంతం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అంతాడా పంచాయతీలో ఆరు గ్రామాల్లో మంచినీటి సౌకర్యం రామాలయాలు అభివృద్ధి వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగానే తాటిమనిపాలెం పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు వసంతం ట్రస్ట్ ముందుకు రావడం పట్ల ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తాటి మాను పాలెం పాఠశాల శిధిల అవస్థకు చేరిందని కొత్త భవనం మంజూరుకు కృషి చేయాలని ఎంఈఓ ను కోరారు. అనంతరం వసంతం ట్రస్ట్ సభ్యులు పెద్దబొడ్డేపల్లి ప్రభుత్వపాఠశాల ప్రధానోపాధ్యాయులు గొడ్డేటి రవికుమార్ మాట్లాడుతూ విశాఖపట్నం వసంతం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాజేటి రఘు రామారావు చొరవతో పాఠశాలకు సామాగ్రిని అందించడం జరిగిందని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువుల్లో రాణించాలని కోరారు. మరిన్ని సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇరవాడ దేముడు మాట్లాడుతూ ధనాన్ని దోచుకోగలరు గాని చదువును ఎవరు దొంగిలించలేరని దీనిని గుర్తించి విద్యార్థులంతా చదువుల్లో రాణించి మంచి బంగారు బాట వేసుకోవాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు ట్రస్టుల ద్వారా విద్యాభివృద్ధికి సహకరించడం అభినందనీయమని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు ఉపాధ్యాయులు జలుమూరి గిరిబాబు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఏర్పాటుచేసిన రేకుల షెడ్డులో పాఠశాలను నడపడం అభినందనీయమని దీనికి ఫర్నిచర్ ఇతర సామాగ్రిని వసంతం ట్రస్ట్ అందజేయడం పాఠశాల అభివృద్ధికి నాంది పలికిందని అన్నారు. అంతేకాకుండా మండలంలో అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇలాంటి ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు.
లోకేష్ సార్ మా పాఠశాలకు భవనం నిర్మించండి విద్యార్థులు విన్నపం
అంతాడ పంచాయతీ తాటి మానుపాలెం ఎంపీపీ పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో దాతలు సహకారంతో నిర్మించిన రేకుల షెడ్డులో చదువులు కొనసాగిస్తున్నామని కావున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి తమ పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని కోరారు. తమ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పుతున్నప్పటికీ మౌలిక సదుపాయాలు, పక్కా భవనం లేకపోవడంతో ఎటు నుండి విష పురుగులు వస్తాయోనని ఆందోళన చెందుతూ చదువుల సక్రమంగా కొనసాగించలేకపోతున్నామని తెలిపారు. ఇప్పటికైనా తమ పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని విద్యార్థులు ముక్తకంఠంతో కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల ఉపాధ్యక్షులు ఉల్లి సత్యనారాయణ, రాజుపేట పాఠశాల హెచ్ఎం అర్జున్, స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్, పాంగి కన్నబాబు, పాంగి సన్యాసిరావు సిగ్గే సన్యాసిరావు గ్రామస్తులు సి ఆర్ పి విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


