తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా ఘాజీ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 19 (అఖండ భూమి న్యూస్)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహమ్మద్ ఘాజీకి తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యునిగా నియామకం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యునిగా నియమితులైన మొహమ్మద్ ఘాజీ, తెలంగాణ ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించేందుకు సహకరించిన షబ్బీర్ అలీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ అవకాశం తనకు గొప్ప బాధ్యతగా భావిస్తూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ఘాజీని అభినందిస్తూ, ఆయనకు ఆశీస్సులు అందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఐరేణి సందీప్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


