
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్.. రికవరీకి సహాయం కోరుతున్న యువకుడు
ఒంగోలు, జూన్ 1 (అఖండ భూమి):
ఒంగోలుకు చెందిన కుర్ర రంగ నాయక్ నాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్ని రోజుల క్రితం తన వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు రెండూ హ్యాక్ అయ్యాయని చెప్పారు.
అయితే, సంబంధిత చర్యలు తీసుకోవడం ద్వారా వాట్సాప్ ఖాతాను తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మాత్రం ఇప్పటికీ తన ఆధీనంలోకి రాలేదని తెలిపారు. “నానిఅమ్ములు_39787” పేరుతో ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తిరిగి పొందేందుకు మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారుల సహకారం అందించాలని కుర్ర రంగ నాయక్ నాని విజ్ఞప్తి చేశారు.
అలాగే, తన ఖాతా నుంచి ఎవరైనా సందేశాలు పంపినా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా వాటిని నమ్మవద్దని స్నేహితులు, బంధువులకు సూచించారు. సంబంధిత సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసి ఖాతా రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.


