ప్రత్యేక గ్రామసభల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం…

ప్రత్యేక గ్రామసభల ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం…

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 4 (అఖండ భూమి న్యూస్);

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 532 గ్రామపంచాయతీలలో విడతల వారీగా ప్రత్యేక గ్రామసభలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జూన్ 4, 6, 8, 10 తేదీలలో గ్రామసభలు నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో భాగంగా గురువారం జిల్లాలోని 136 గ్రామపంచాయతీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా దోమకొండ మండలంలోని గొట్టుముక్కుల గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరై గ్రామస్థులతో సమావేశమయ్యారు.

గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మురికి కాలువలను శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, తాగునీటి వనరులు, వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచడం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు.

ఘన వ్యర్థాల నిర్వహణ రూల్స్–2026ను గ్రామపంచాయతీలు తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. తడి, పొడి, శానిటరీ , ప్రత్యేక వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి నిర్వహించాలని సూచించారు.

గ్రీన్ బుట్టలో తడి వ్యర్థాలు, బ్లూ బుట్టలో పొడి వ్యర్థాలు, రెడ్ బుట్టలో శానిటరీ వ్యర్థాలు, నల్ల రంగు బుట్టలో ప్రత్యేక వ్యర్థాలను వేరు చేసి గ్రామపంచాయతీకి అందించాలని ప్రజలకు సూచించారు.

గ్రామసభలో తాగునీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR-2026), పంటల మార్పిడి, బడిబాట కార్యక్రమం, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

రైతులు సంప్రదాయ పంటలతో పాటు పంటల మార్పిడిని అలవాటు చేసుకొని ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.

అర్హులైన లబ్ధిదారులను గ్రామసభల ద్వారా గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ప్రత్యేక గ్రామసభలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ గ్రామ సభలో ఎఫ్ డి ఓ , డిపిఓ, హార్టికల్చర్, డి ఎల్ పి ఓ, సర్పంచ్ నత్తి సంజీవ్ గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!